సంక్రాంతికి హీరోలు సై.. బరిలో నాలుగు సినిమాలు

కరోనా భయం కొనసాగుతున్న వేళ…థియేటర్లు తెరిస్తే ప్రేక్షకులు వస్తారా? మునుపటిలా వసూళ్లు ఉంటాయా? యాభై శాతం ప్రేక్షకులతో సినిమాలు గట్టెక్కుతాయా? – ఇలా మొన్నటి వరకూ ఎన్నెన్నో సందేహాలు వెంటాడాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణ చూశాక పరిశ్రమలో నమ్మకం పెరిగింది. వరుసగా సంక్రాంతి సినిమాల విడుదల తేదీలు ఖరారైపోయాయి. తెలుగునాట ఎప్పట్లాగే ఈసారీ సంక్రాంతి బరిలోకి నాలుగు చిత్రాలు దిగాయి. వినోదాన్ని పంచేందుకు పోటాపోటీగా ముస్తాబవుతున్నాయి.

ముగ్గుల పండగలో సినిమా కూడా ఓ భాగం. సంక్రాంతికి తెలుగులో ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు చూస్తారని ఓ నమ్మకం. కుటుంబమంతా కలిసి థియేటర్లకు వెళుతుంటారు. అందుకే సంక్రాంతి అనగానే సినిమాలు వరుస కడుతుంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమ అతి పెద్ద సీజన్‌గా పరిగణిస్తుంటుంది. బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డులు నమోదవుతుంటాయి. అగ్ర తారల సినిమాలతోపాటు పరిమిత వ్యయంతో తెరకెక్కిన చిత్రాలు కూడా మెరుస్తుంటాయి. అయితే కరోనా భయాలు కొనసాగుతున్న వేళ ఈసారి సినీ సంక్రాంతి ఎలా ఉంటుందో అనే సందేహాలు వెంటాడాయి. కానీ ఎట్టకేలకు ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ నాలుగు సినిమాలు విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. రవితేజ ‘క్రాక్’, రామ్‌ ‘రెడ్‌’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ‘అల్లుడు అదుర్స్‌’, విజయ్‌ ‘మాస్టర్‌’ చిత్రాలు ఈసారి సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. వీటిపై నిర్మాతలు పెట్టిన పెట్టుబడులు రూ.120 కోట్ల పైమాటే అని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This