అందాల తారల డ్రీమ్​రోల్స్​ ఇవే

కథానాయిక అంటేనే అందం.. అదే వాళ్లకు ఆభరణం. ప్రేక్షకులు వాళ్ల నుంచి ఆశించేది కూడా గ్లామరే. అదే పెట్టుబడిగా చిత్రసీమలో స్టార్‌లుగా ఎదిగినవాళ్లు ఎందరో. కానీ పరిస్థితి మారుతోంది. డీగ్లామర్‌ పాత్రల్లోనూ హీరోయిన్లను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీంతో నాయికల ఆలోచనలోనూ మార్పొచ్చింది. అందానికి అవకాశం లేకపోయినా అభినయానికి ఆస్కారం ఉంటే చాలనుకుని రంగంలోకి దిగుతున్నారు కొందరు. ఇంకా వాళ్ల మనసుల్లో పాత్రల గురించిన ఏవో కోరికలు అలానే ఉన్నాయి. మాకూ కొన్ని కలల పాత్రలు ఉన్నాయంటున్నారు మన తెలుగు నాయికలు. మరి ఆ కలల పాత్రల కథేంటో చదివేయండి.

నేను కోరుకున్నది దొరికింది

గ్లామర్‌ పాత్రలే కాదు భిన్నమైన పాత్రలెన్నో పోషించి మెప్పించింది సమంత. ఎక్కువగా నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలకే పెద్ద పీట వేస్తూ దక్షిణాదిలో స్టార్‌ నాయికగా దూసుకుపోతుంది. ఆమె ప్రస్తుతం తన కలల పాత్రలో నటిస్తోంది. సమంత ‘ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2తో డిజిటల్‌ తెరపై అలరించనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటిస్తోంది. దీనిపై ఆమె స్పందిస్తూ..‘‘మంచి కిక్కిచ్చే షోతో వెబ్‌సిరీస్‌లోకి అడుగుపెడుతున్నా. నా డ్రీమ్‌రోల్‌లో నటించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అంటోంది.

నీలాంబరిలా…

చాలా రోజుల తరువాత తెరపై పలకరించడానికి సిద్ధమైంది ప్రియమణి. నారప్పలో సుందరమ్మగా, విరాటపర్వంలో భారతక్కగా అలరించబోతుంది. ఇవి రెండూ విభిన్నంగా కనిపించే పాత్రలే. తెరపై ఇలాంటివే కాకుండా అందరినీ నవ్వించేలా తనకో సినిమా చేయాలని ఉందని చెబుతోందీ ప్రియ. ‘‘రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి లాంటి ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించాలనేది నా కోరిక. ఒక పూర్తి స్థాయి కామెడీ చిత్రమూ చేయాలని ఉంది’’ అని తన డ్రీమ్‌ రోల్‌ గురించి పంచుకుంది ప్రియమణి.

ఏ మాయ చేసావెలాంటి ప్రేమ కథ

నటిగా ఎన్నో పాత్రల్లో నటిస్తుంటాం. అలా కాకుండా చిరస్థాయిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్రలో తెరపై వెలగాలని ఉందంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. “డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అంటే ఒక సినిమా చేయాలి. ఆ పాత్రను ప్రజలు సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకోవాలి. ఏ మాయ చేసావె లాంటి ప్రేమకథలో నటించాలి. నాయికా ప్రాధాన్య చిత్రాల గురించి నేనెప్పుడూ ఆలోచించను. వాటి గురించి ప్రణాళికలు కూడా లేవు. కానీ కథలు వస్తే తప్పకుండా చేస్తా” అంటోంది రకుల్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This