‘కట్టలు’ తెంచుకుంటున్న ఎన్నికల ఖర్చు

ఎన్నికల్లో పోటీ పడుతున్న ఎంతోమంది నాయకులు వ్యయానికి సంబంధించిన నియమాలను పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘం విధించిన నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఈ తరం రాజకీయ నాయకులు మరో అడుగు ముందుకు వేసి ఓటుకు ‘రేటు’ నిర్ణయిస్తున్నారు. స్వేచ్ఛగా వినియోగించుకోవాల్సిన ఓటు అనే ఆయుధాన్ని రాజకీయ పార్టీలు అంగట్లో సరకుగా మార్చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ గ్రామపంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికీ భారీయెత్తున వ్యయం చేస్తున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శాసనసభకో లోక్‌సభకో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల సంగ్రామంలో కోట్లాది రూపాయలు మంచినీళ్లలా గుమ్మరిస్తున్నారు.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లే..

ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవే! కానీ, దానికి ఓ లెక్కా పత్రం ఉంటుంది. అందుకు లోబడి అభ్యర్థులు ఖర్చు చేయాలి. ప్రతి పైసా ఖర్చునూ తప్పనిసరిగా ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతి అభ్యర్థి 45 రోజుల్లోగా వారు ప్రచారంలో చేసిన ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘానికి నివేదించాలి. ఒకవేళ అభ్యర్థి ఖర్చు- నిర్దేశించిన పరిమితికి మించి ఉంటే అది 1961 ఎన్నికల నియమావళి నిబంధన(90)ను ఉల్లంఘించినట్లే.

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 123(6) ప్రకారం అక్రమంగా వ్యయం చేసినట్లు గుర్తిస్తారు. ఇటీవల అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వ్యయాన్ని గతంతో పోలిస్తే పదిశాతం మేర పెంచారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయానికి ఎన్నికల కమిషన్‌ ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం మేరకే ఇటీవల బిహార్‌లో జరిగిన ఎన్నికల్లో; పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అభ్యర్థులు వ్యయ నిబంధనలను పాటించారు. ప్రస్తుతం అసెంబ్లీకి పోటీ చేసేవారికి ఎన్నికల వ్యయాన్ని పెద్ద రాష్ట్రాల్లో రూ.28లక్షల నుంచి రూ.30.80లక్షలకు, పార్లమెంటుకు పోటీ చేసేవారి ఖర్చును రూ.70లక్షల నుంచి రూ.77లక్షలకు కేంద్రం పెంచింది. చిన్న రాష్ట్రాలైన గోవా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ తదితరాల్లో అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల వ్యయాన్ని రూ.20లక్షల నుంచి రూ.22లక్షలకు, పార్లమెంటు స్థానాల్లో వ్యయాన్ని రూ.54లక్షల నుంచి రూ.59లక్షలకు పెంచింది. పురపాలక ఎన్నికల్లో లక్ష రూపాయలు, నగర పాలక పరిధిలో రూ.1.5లక్షలు వ్యయానికి అనుమతించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసేవారు అయిదు లక్షల రూపాయలుఖర్చు చేసేలా వీలు కల్పించింది.

ధన ప్రవాహం భారీగా..

ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ధన ప్రవాహం భారీగా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసే స్తోమతగల అభ్యర్థులనే రాజకీయపార్టీలు గుర్తించి ఎన్నికల బరిలో నిలిపాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 74.04 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 52.08శాతం; మహిళలు 47.90శాతం. రాజకీయ పార్టీలు ఓటర్లను చైతన్యవంతులను చేసి ఓటు హక్కు వినియోగించుకునేలా కృషి చేయాలి.

గత ఎన్నికల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నగరపాలక సంస్థల ఎన్నికల్లో పోలింగ్‌ 46శాతం కంటే తక్కువే కావడం గమనార్హం. ఈ సారైనా పోలింగ్‌ శాతం పెరుగుతుందా అనేది ఆసక్తికరమైన అంశం. పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణాలను రాజకీయ పార్టీలు లోతుగా అన్వేషించి, అవి పునరావృతం కాకుండా చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు పురపాలక, నగరపాలక ఎన్నికల్లో వేలాది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో చాలామంది ఇప్పటికీ తమ ఎన్నికల వ్యయాలను సమర్పించకపోవడం గమనార్హం.

నేర చరితులను ఎన్నికల్లో పోటీకి నిలపడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. అయినా ఈ ధోరణి ఆగడం లేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో సైతం పార్టీలు నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు టికెట్లిచ్చినట్లు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అభిప్రాయపడింది. ఆ నివేదిక ప్రకారం ఎంఐఎం 14శాతం, భాజపా 11శాతం, టీఆర్‌ఎస్‌ తొమ్మిది శాతం, కాంగ్రెస్‌ ఎనిమిది శాతం చొప్పున నేరచరిత ఉన్నవారికి టికెట్లిచ్చాయి. ఇలాంటి కారణాలవల్ల కూడా ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. దానివల్ల పోలింగ్‌ శాతం మందగించే అవకాశం ఉంది. పార్టీలు నేర చరితులను ఎన్నికల్లో నిలబెట్టడంపై ఎన్నికల సంఘమూ గట్టి చర్యలకు దిగాల్సిన అవసరం ఉంది. గ్రేటర్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే ఎన్నికల సంఘానికి- రాజకీయ పార్టీలతో పాటు ప్రజల సహకారం ఎంతో అవసరం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This