ప్రధాని మోదీకి కొత్త విమానం మరింత ఆలస్యం!

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రయాణాల కోసం అమెరికాకు చెందిన బోయింగ్​ సంస్థతో రెండు బీ777 విమానాలు తయారు చేయిస్తోంది భారత్​. వీటిలో ఒకటి ఈ వారంలో భారత్​కు రావాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాల వల్ల డెలివరీ ఆలస్యమవుతుందని ఎయిర్​ ఇండియా అధికారులు వెల్లడించారు.

బోయింగ్​ నుంచి విమానాన్ని తీసుకునేందుకు ఎయిర్​ ఇండియా అధికారులు ఈ నెల తొలినాళ్లల్లోనే అమెరికాకు వెళ్లారు. కానీ విమాన డెలివరీ ఆలస్యమైంది. మరో విమానం సెప్టెంబర్​లో భారత్​కు చేరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనాతో…

వాస్తవానికి ఈ విమానాలను బోయింగ్ జులైలోనే డెలివరీ చేయాల్సి ఉంది. కొవిడ్​-19 సంక్షోభం కారణంగా సకాలంలో రాలేకపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ రెండు బీ777 విమానాలను భారత వాయుసేన పైలట్లు ఆపరేట్ చేస్తారు. వీటి నిర్వహణ బాధ్యత మాత్రం ఎయిర్ ఇండియాదే.

747 నుంచి 777కు…

ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ప్రస్తుతం బీ747 విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఇది ‘ఎయిర్ ఇండియా వన్​’ గుర్తును కలిగి ఉంటుంది. ఎయిర్ ఇండియా పైలట్లే వీటిని ఆపరేట్​ చేస్తున్నారు.

బోయింగ్​ తయారు చేస్తున్న బీ777 విమానాల్లో అత్యాధునిక రక్షణ వ్యవస్థ, సెల్ఫ్​ ప్రొటెక్షన్​ సూట్లను ఉపయోగించనున్నారు. రెండు రక్షణ వ్యవస్థలను 190 మిలియన్​ డాలర్లకు విక్రయించేందుకు అమెరికా ఫిబ్రవరిలో అంగీకరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This