‘పారదర్శక పన్ను విధానం’ వేదికను ప్రారంభించనున్న మోదీ

కరోనా సంక్షోభం కారణంగా అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థను పునర్​నిర్మించేందుకు పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని భావిస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం. ప్రత్యక్ష పన్ను విధానాన్ని ఇంకా సులభతరం చేసి, నిజాయతీగా పన్ను చెల్లిస్తున్న వారికి బహుమతులు ఇవ్వాలనే లక్ష్యంతో ‘పారదర్శక పన్ను విధానం’ వేదికను ఏర్పాటు చేయనుంది.

‘ట్రాన్స్​పరెంట్​ ట్యాక్సేషన్​ హానరింగ్​ ద హానెస్ట్’ ప్లాట్​ఫాంను ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొననున్నారు.

సంస్కరణలకు సంబంధించిన వివరాలు ప్రభుత్వ ప్రకటన తెలపనప్పటికీ.. గత ఆరు సంవత్సరాలలో చేపట్టిన ప్రత్యక్ష పన్ను సంస్కరణల ప్రయాణాన్ని ముందుకు సాగించనున్నట్లు తెలుస్తోంది.

పన్ను సంస్కరణల్లో భాగంగా గతేడాది కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది కేంద్రం. నూతన తయారీ యూనిట్లకు ఈ రేటును 15 శాతానికి కుదించింది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌‌ను కూడా తొలగించింది. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న నూతన ప్లాట్​ఫాం ద్వారా మరిన్ని సంస్కరణలను తీసుకురానుంది.

పన్ను శాతాన్ని తగ్గించడం, ప్రత్యక్ష పన్నుల చట్టాలను సరళీకరించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది. ఐటీ శాఖ పనితీరులో సామర్థ్యం, పారదర్శకత తీసుకురావడమే లక్ష్యమని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This