నేటి నుంచి ‘స్మార్ట్​ ఇండియా​ హ్యాకథాన్’​.. మోదీ హాజరు!

ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్​లైన్ హ్యాకథాన్ కార్యక్రమం స్మార్ట్​ ఇండియా హ్యాకథాన్​-2020 నేటినుంచి(ఆగస్టు 1) ప్రారంభంకానుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో విద్యార్థులతో ముచ్చటించనున్నారు మోదీ. అలాగే నూతన విద్యా విధానంపైనా ప్రధాని తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ మేరకు హెచ్​ఆర్​డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటన చేశారు.

విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడంలో భాగంగా 2017 నుంచి స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నారు. నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఐ4ఈ సంస్థలు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి.

ఆవిష్కరణల వేదిక: మోదీ

‘స్మార్ట్​ ఇండియా హ్యాకథాన్ అనేది​ సమస్యల పరిష్కారం దిశగా సరికొత్త ఆవిష్కరణలకు శక్తిమంతమైన వేదిక. సాధారణంగా ఈసారి యువత ఆత్మనిర్భర్​ భారత్ సాధన​ మార్గాలతో పాటు తమ ఆవిష్కరణలతో కొవిడ్​-19 అనంతర ప్రపంచంపై దృష్టి సారిస్తారు’ అని ట్వీట్​ చేశారు మోదీ. శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఆన్​లైన్​ ద్వారా హాజరుకానున్నట్లు తెలిపారు. హ్యాకథాన్​ గ్రాండ్​ ఫినాలేకు చేరుకున్న వారిని కలిసి, వారి పనితీరును తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ​

సమస్యల పరిష్కారానికి..

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నిర్వహణకు కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమం ఎంతో వినూత్నమైన ప్రక్రియ అని పోఖ్రియాల్ పేర్కొన్నారు. మనదేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను, సమస్యల పరిష్కారం కోసం సృజనాత్మక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కసరత్తు జరిపేందుకు ఇదో వినూత్న మార్గమని చెప్పారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపకల్పన చేసే పోటీలో ఈ కసరత్తు నిర్విరామంగా, నిరాటంకంగా సాగుతుందని.. ఇందులో సాంకేతిక వరిజ్ఞానం కలిగిన విద్యార్థులు వివిధ సమస్యలకు సృజనాత్మక పరిష్కారం సూచించేలా ఆయా సమస్యలను విద్యార్థులకు పరిచయం చేసేందుకు హ్యాకథాన్​లో వీలవుతుందన్నారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, శాఖలు, ప్రైవేటు రంగ సంస్థలు ఎదుర్కొనే సవాళ్లకు పరిష్కారం కనుగొనే కసరత్తులో విద్యార్థులు పాలుపంచుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This