అమెరికాలో అందుబాటులోకి మరిన్ని టీకాలు!

కరోనా వైరస్ ఉద్ధృతితో అతలాకుతలమవుతున్న అమెరికాలో మరికొన్ని వ్యాక్సిన్​లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫైజర్​తో పాటు మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపిన అగ్రరాజ్యం.. ఇతర వ్యాక్సిన్ల​పై అధ్యయనం చేస్తోంది. ప్రపంచదేశాలకు సరిపడా టీకా డోసులను సరఫరా చేయాలంటే మరికొన్నింటిని అందుబాటులోకీ తీసుకురావాల్సిన అవసరం ఉందని భావిస్తోంది.

రెండు సరిపోవు: ఫౌచీ

అమెరికా జనాభా మొత్తానికి వ్యాక్సిన్ అందించాలంటే రెండు కంపెనీలు సరిపోవని, మరికొన్ని టీకాలు అవసరమవుతాయని ప్రముఖ అంటువ్యాధుల శాస్త్ర నిపుణులు డా. అంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. బ్రిటన్​లో వ్యాప్తి చెందిన కరోనా వైరస్​ను ఈ టీకాలు నివారిస్తాయా అనే ప్రశ్నలపై ఫౌచీ సమాధానం ఇచ్చారు. టీకాను వైరస్ ఎదుర్కొంటుందనే విషయంపై ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. అయితే దీనిపై నిర్ధరణకు వచ్చేందుకు శాస్త్రవేత్తలు విస్తృత అధ్యయనం చేస్తున్నారని వివరించారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం శనివారం నాటికి అమెరికాలోని రాష్ట్రాలకు కోటి 50 లక్షల డోసులు సరఫరా అయ్యాయి. అందులో 19 లక్షల టీకాలను ప్రజలకు అందించారు. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత పెరిగిందని నిపుణులు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ప్రొవైడర్ల నుంచి సమాచారం అందిన తర్వాత దాన్ని వెబ్​సైట్​లో అప్​డేట్ చేసేందుకు సమయం పడుతోందని చెప్పారు.

మరోవైపు, దిగ్గజ సంస్థ నొవావాక్స్ తయారు చేసిన టీకాపై చివరి విడత ప్రయోగాలు మొదలయ్యాయి. అమెరికాలో తుది దశకు చేరుకున్న టీకాల్లో ఇది ఐదోది కావడం విశేషం. టీకా భద్రతను పరీక్షించేందుకు 30 వేల మంది వలంటీర్లపై ప్రయోగాలు చేపట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This