ఒకరి నిర్లక్ష్యం ఎందరికో శాపం.. మాస్క్ మర్చిపోవద్దు..

మాస్కు తప్పనిసరిగా ధరించాలనీ.. వ్యక్తికీ, వ్యక్తికీ మధ్య కనీసం ఆరు అడుగుల దూరాన్ని పాటించాలనీ.. ఏదైనా వస్తువును తాకిన ప్రతి సందర్భంలోనూ చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలనీ.. ప్రభుత్వం, ప్రసార మాధ్యమాలు పదేపదే చెబుతున్నా.. ఇప్పటికీ కొందరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఒక్కరి కారణంగా ఎందరో వైరస్‌ బారినపడుతున్నారు. ఎవరి నుంచి ఎవరికి వైరస్‌ సోకుతుందో తెలియని గందరగోళ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నట్లు వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తొలుత అంతర్జాతీయ ప్రయాణికులు.. తర్వాత మర్కజ్‌.. వారి సన్నిహితులు.. ఆ తర్వాత వలస కార్మికులు.. ఇలా వైరస్‌ వ్యాప్తికి కొంత కాలం వరకూ కారణాలుగా గుర్తించినా.. ప్రస్తుతం అత్యధిక కేసులు రాష్ట్రవాసుల్లోనే వెలుగులోకి వస్తున్నాయి. ఎవరు కారణమనే స్పష్టత కొరవడిందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వైరస్‌ కట్టడికి ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

అవగాహన ఉండీ..

ఇటీవల ఒక ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారి వద్ద జరిగిన సమావేశంలో సంబంధిత శాఖకు చెందిన అధికారులు ఒకే గదిలో కిక్కిరిసి కూర్చుని ఉన్నారు. అందులో కొందరు మాస్కులు పెట్టుకున్నారు. మరికొందరు పెట్టుకున్నా కిందకు వదిలేశారు. గుసగుసలాడుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కరిలో కరోనా వైరస్‌ ఉన్నా.. ఆ గదిలో ఉన్న అధికారులందరికీ వైరస్‌ సోకే ప్రమాదముంది. ఈ విషయం వారికి తెలియదా అంటే.. ఆ మాత్రం అవగాహన వారిలో ఉంది. కాకపోతే తమకేమి కాదనే ధీమా. తమ పక్కనున్నవారు ఆరోగ్యంగా కనిపిస్తున్నారు కాబట్టి.. వారిలో వైరస్‌ ఉండదనే భ్రమ. ఇలాంటి పరిణామాలు ఎంతో ప్రమాదకరమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా భోజన విరామ సమయాల్లో, కార్యాలయాలకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు మాస్కులు కిందకు వదిలేయడం కొంతమందిలో సాధారణమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This