సిక్కోలు టూ సిడ్నీ ఒలింపిక్స్​​: మల్లీశ్వరి మళ్లీ వస్తోంది..!

బయోపిక్‌ వార్త అధికారికంగా బయటకు వచ్చాక.. నేను 33 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాను. ఎక్కడ సిక్కోలు.. ఎక్కడ సిడ్నీ! ఎన్నో సంవత్సరాల కఠిన శ్రమ. సడలని పట్టుదల.. అవన్నీ కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఉత్సాహంగా నేను బరువులు ఎత్తినప్పుడు ‘ఆడపిల్లకు ఇవేం పాడు పనులు’ అన్నవాళ్లున్నారు. ‘మగరాయుడిలా ఈ వేషాలేంటే!’ అని దెప్పిపొడిచారు. అప్పుడు నాకు 12 ఏళ్లు ఉంటాయంతే! ఏదో సాధించాలనే తపనే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది.

దారిలో ముళ్లపొదలెన్నో..

ఆడపిల్లనైతే మాత్రం కొన్నిటికే పరిమితం అని అనుకోవడం ఎందుకు? ఎవరేమన్నా లక్ష్యపెట్టకుండా కష్టపడ్డాను. కండలు తిరిగిన దేహం కోసం.. కొండంత బరువులు ఎత్తేదాన్ని. శారీరక సామర్థ్యం కోసం వ్యాయామాలు చేసేదాన్ని. సరైన సౌకర్యాలు లేకున్నా.. ఉన్నవాటితో నిరంతరం శ్రమించేదాన్ని. తిండి కలిగితేనే కండ! కానీ, అంతటి పౌష్టిక ఆహారం ఎక్కడిది. అంబలి తాగి కసరత్తులు చేసేదాన్ని. బచ్చలికూర, మునగాకు ఇవే ప్రొటిన్‌ ఫుడ్‌. మనోబలమే ముందుకు నడిపింది నన్ను. దారిలో ముళ్లపొదలు అడ్డొచ్చాయి. రాళ్లు గుచ్చుకున్నాయి. అన్నీ ఓర్చుకున్నా. నా ప్రయాణంలో కావాల్సినంత కథ ఉంది. ఆ విశేషాలన్నీ ఇప్పుడు చెప్పలేను. సినిమాలో చూస్తేనే బాగుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This