నేడు జీహెచ్​ఎంసీ తెరాస అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ భేటీ..

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులతో శుక్రవారం భేటీ కానున్నారు. మొత్తం 150 డివిజన్ల అభ్యర్థులు ఇందులో పాల్గొంటారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార సరళి ఇతర అంశాలపై చర్చించనున్నారు. తెరాస జాబితాలో అధికశాతం ప్రస్తుత కార్పొరేటర్లు కాగా.. పలువురు కొత్త అభ్యర్థులున్నారు. వారందరి పరిచయంతో పాటు వ్యక్తిగతంగా కేటీఆర్‌ మాట్లాడే అవకాశం ఉంది. వారి మనోభావాలు, రాజకీయ సంకల్పం, ఇతర అంశాలను తెలుసుకుంటారు. ఈసారి ఎన్నికలను తెరాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందున గెలుపు అవసరంతో పాటు స్థానిక నేతలు, కార్యకర్తలతో సమన్వయం, విస్తృత ప్రచారం, ఇన్‌ఛార్జులతో కలిసి నడవడం వంటి అంశాలపై కేటీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

శనివారం కుత్బుల్లాపూర్‌ నుంచి కేటీఆర్‌ ప్రచారం

అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు శుక్రవారంతో గడువు ముగియనుండటంతో మంత్రి కేటీఆర్‌ శనివారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. పక్కనే ఉన్న కూకట్‌పల్లి నియోజకవర్గంలోనూ ఆయన రోడ్‌షో నిర్వహిస్తారు. నగరంలోని 100 డివిజన్ల పరిధిలో 29 వరకు రోడ్‌షోలు జరుగనున్నాయి.

తెరాసకు వివిధ సంఘాల మద్దతు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాసకు.. తెలంగాణ అర్చక సమాఖ్య, తెలంగాణ అర్చక ఉద్యోగ కార్యాచరణ సమితి, నాయి బ్రాహ్మణ సంఘం మద్దతు ప్రకటించాయి. బ్రాహ్మణులు, అర్చక ఉద్యోగులకు ప్రభుత్వ వేతనాలిచ్చి గౌరవించినందున మద్దతు ప్రకటిస్తున్నట్లు సమాఖ్య, ఐకాసల ఛైర్మన్‌ గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం ప్రకటించడంపై నాయిబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ, ఇతర నేతలు పెంబర్తి శ్రీనివాస్‌, గడల రాజులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస విజయానికి కృషి చేస్తామన్నారు. ఇంకా విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మానందచారి, ప్రధాన కార్యదర్శి లాలుకోట వెంకటాచారిలు కూడా మద్దతు ప్రకటించారు. వీరందరికీ కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఉపేంద్రశర్మ ప్రభుత్వం దృష్టికి తెచ్చిన పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This