‘కోహ్లీని దిల్లీ ఫ్రాంచైజీ అందుకే తీసుకోలేదు’

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఐపీఎల్‌ ఆరంభ టోర్నీలో దిల్లీ డేర్‌డెవిల్స్‌(డీడీ) ఎందుకు తీసుకోలేదో తెలిసింది. 2008లో ఐపీఎల్‌ తొలి సీజన్‌ సందర్భంగా నిర్వహించిన వేలంలో ఆ జట్టు కోహ్లీని వదిలేసింది. దీంతో అప్పటి నుంచీ అతడు ఆర్సీబీతో కొనసాగుతున్నాడు. అప్పట్లో దిల్లీ ఎందుకు తీసుకోలేదనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. ఐపీఎల్‌ మాజీ సీఓఓ సుందర్ రామన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ కారణాలను వెల్లడించారు. అసలా ప్రక్రియ ఎలా సాగిందో వివరించారు.

“ఆ ఏడాది కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచింది. అది కూడా ఐపీఎల్‌ వేలానికి నెలరోజుల ముందే. దాంతో ఆ ఆటగాళ్లకు ప్రత్యేక వేలం నిర్వహించాలని భావించాం. అప్పటికే కోహ్లీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏ ఫ్రాంఛైజీ అయినా తొలుత అతడినే తీసుకుంటుందని భావించారు. ఈ క్రమంలోనే దిల్లీ డేర్‌డెవిల్స్‌ లోకల్‌ బాయ్‌ని తీసుకుంటుందని ఊహించారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆ జట్టు కోహ్లీని పాస్‌ చేసింది. అతడికి బదులు ప్రదీప్‌ సంగ్వాన్‌ను తీసుకుంది. ఎందుకంటే వారికి ఇంకో బ్యాట్స్‌మన్‌ అవసరం లేదని చెప్పారు. నిజంగానే వారికా అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే ఆ జట్టులో సెహ్వాగ్‌, డివిలియర్స్‌ ఉన్నారు. వాళ్ల నిర్ణయం సరైందే. తర్వాత ఆర్సీబీ కోహ్లీని తీసుకుంది.”

-సుందర్ రామన్, ఐపీఎల్ మాజీ సీఓఓ

తొలి సీజన్‌ నుంచి ఆర్సీబీతోనే కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 177 మ్యాచ్‌లాడి 37.85 సగటుతో 5,412 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్​లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దిల్లీ తీసుకున్న సంగ్వాన్‌ 39 మ్యాచ్‌ల్లో 8.79 ఎకానమీతో 35 వికెట్లు తీశాడు. తర్వాత డోపింగ్‌ టెస్టుల్లో పట్టుబడి 15 నెలల నిషేధం ఎదుర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This