అదనపు ఆదాయమంతా కేంద్రానికే!

ఇప్పటికే ఉన్న సెస్సులు చాలవన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రకటించే కొత్త బడ్జెట్లో ఒకటో రెండో కొత్త సెస్సులు విధించే అవకాశముంది. కొవిడ్‌ నిరోధానికి వ్యాక్సిన్లపైనా, ఇతర విధాలుగా ప్రభుత్వం చేసే ఖర్చును తట్టుకోవడానికి ప్రత్యేక సెస్సు విధించవచ్చు. అలాగే చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వల్ల పెరిగిన రక్షణ వ్యయాన్ని భరించడానికి మరొక సెస్సు విధించే అవకాశముంది. ఈ సెస్సులను అధికాదాయ వర్గాలపైన, కొన్ని పరోక్ష పన్నులపైన విధించాలని నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. మరికొందరైతే పెట్రోలియం, డీజిల్‌ ఎక్సైజ్‌ సుంకంపై కానీ, కొన్ని కస్టమ్స్‌ సుంకాలపై కానీ సెస్సు విధించాలని ప్రతిపాదించారు.

కొవిడ్‌ కష్టకాలంలో తమ ఆదాయాలు పడిపోయినందు వల్ల కొత్త పన్నులు విధించరాదని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని కోరడంతో, సర్కారు అదనపు ఆదాయం కోసం సెస్సుల బాట పడుతున్నట్లుంది. దేశమంతటా పౌరులు ఉద్యోగ, వ్యాపార నష్టాలకు గురైనందువల్ల వారి ఆదాయాలు పడిపోయాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగం పెద్ద సంఖ్యలో దివాలాలను చవిచూసింది. ఈ పరిస్థితిలో పన్ను రేట్లను పెంచడం మొదటికే మోసం తెస్తుంది. కానీ, వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించాలంటే మౌలిక వసతులు, ఆత్మనిర్భర్‌ భారత్‌, గ్రామీణ ఉపాధి హామీ వంటి కార్యక్రమాలపై పెద్దయెత్తున నిధులు వెచ్చించాలి. దేశమంతటా కొవిడ్‌ వ్యాక్సిన్లు వేయడానికి రూ.65,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ నిధులను సమీకరించడానికి కేంద్ర సర్కారు పన్ను రేట్లను కాకుండా సెస్సులను పెంచే అవకాశం కనిపిస్తోంది.

పరిస్థితి మారాలి

సెస్సుల ద్వారా వచ్చే అదనపు ఆదాయమంతా కేంద్రానికే దఖలు పడుతున్నదే తప్ప తమకేమీ ఒరగడంలేదని రాష్ట్రాలు చాలాకాలంగా అభ్యంతరపెడుతున్నాయి. కొవిడ్‌ వల్ల రాష్ట్రాలూ ఆర్థికంగా చితికిపోయాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు ఓ పక్క సహకార సమాఖ్యవాదం గురించి గట్టిగా చెబుతూనే- ఆదాయంలో తమకు న్యాయమైన వాటాకు గండి కొడుతోందని రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. రాజ్యాంగంలోని 270వ అధికరణ కేంద్రం, రాష్ట్రాలు పంచుకోవలసిన విభాజ్య నిధిలోకి వచ్చే పన్నుల గురించి వివరిస్తుండగా, 271వ అధికరణ సెస్సులు, సర్‌ఛార్జీల గురించి ఏకరువు పెడుతోంది. వీటిని రాష్ట్రాలతో పంచుకోవలసిన అవసరం లేదు. ఈ పరిస్థితి మారాలని తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పన్ను మీద పన్ను

సెస్సులు, సర్‌ఛార్జీలను పన్ను మీద పన్నుగా భావించాలి. ఇవి బ్రిటిష్‌ పాలనలోనూ ఉన్నాయి. భారత్‌లో మొట్టమొదటి సెస్సును అగ్గిపెట్టెలపై విధించారు. స్వతంత్ర భారతంలో పరిశ్రమల అభివృద్ధి కోసం ఉప్పు, తేయాకుపై సెస్సు వేశారు. తరవాత కార్మిక సంక్షేమం కోసమూ విధించేవారు. ఇనుము, సున్నపురాయి, డోలమైట్‌ గనులు, సినీ కార్మికుల కోసం సెస్సులు వసూలు చేశారు. 1944 నుంచి మొత్తం 42 సెస్సులు విధించారు. 2017లో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానం అమలులోకి వచ్చాక చాలా సెస్సులు రద్దయ్యాయి. 17 సెస్సులను జీఎస్టీలో కలిపేశాక కూడా 35 సెస్సులు అమలులో ఉన్నట్లు కాగ్‌ తెలిపింది.

ముడి చమురు సెస్సు వసూళ్లను చమురు రంగంలో ఏ పరిశ్రమకూ కేటాయించలేదని.. విద్య, ఆరోగ్య సెస్సు మొత్తాల్లో ఆరోగ్యం కోసం ఏమీ ఖర్చు చేయలేదని కూడా పేర్కొనడం గమనార్హం. సర్‌ఛార్జీలను అధిక ఆదాయపరులపై విధిస్తారు. భారత్‌లో కోటి రూపాయలకన్నా ఎక్కువ వార్షికాదాయం కలిగినవారు తమ ఆదాయపన్నులో 15శాతాన్ని సర్‌ఛార్జిగా చెల్లించాలి. కోటి రూపాయలకన్నా ఎక్కువ లాభం ఆర్జించే కంపెనీలు తమ పన్నులో 7.5 శాతాన్ని సర్‌ఛార్జిగా చెల్లించాలి. ఆదాయపన్నుపై భారత్‌ చాలా ఎక్కువ సర్‌ఛార్జి విధిస్తోంది. చాలా దేశాల్లో ఈ పద్ధతి లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This