రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనే లక్ష్యం.. శాసనసభలో బిల్లులు

రెవెన్యూ వ్యవస్థలో పేరుకున్న అవినీతిని పూర్తిగా నిర్మూలించి ప్రజలకు… సులువుగా, పారదర్శకంగా సేవలందేలా సంస్కరణలతో కూడిన కొత్త రెవెన్యూ చట్టం తెస్తామని చాలా రోజులుగా ప్రభుత్వం చెబుతోంది. రెవెన్యూవ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆ శాఖను ఎవరికీ కేటాయించకుండా తన వద్దే అట్టిపెట్టుకున్నారు. కొత్త రెవెన్యూ చట్టం కోసం కొన్నాళ్లుగా… సీఎం కేసీఆర్​ విస్తృత కసరత్తు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయిలో అనుభవమున్న అధికారులు, విశ్రాంత అధికారులు, నిపుణులు, రెవెన్యూ ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులతో పలుసార్లు.. సీఎం చర్చించారు. అవినీతి, అలసత్వానికి తావులేకుండా ప్రజలకు భూములకు సంబంధించిన సేవలు.. పారదర్శకంగా అందేలా చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.

వీఆర్వో వ్యవస్థ రద్దు అయ్యాక..!

రెవెన్యూ శాఖలో తరచూ వెలుగుచూస్తున్న అవినీతి ఉదంతాలకు ఆస్కారం లేకుండా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో సేవలందించడంపై సీఎం సమాలోచనలు చేశారు. అన్నింటిని పరిగణలోకి తీసుకొని కొత్త రెవెన్యూ చట్టం కోసం అవసరమైన ముసాయిదా బిల్లులను సిద్ధం చేశారు. ముసాయిదా బిల్లులకు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే వారి వద్ద నుంచి రెవెన్యూ రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం…వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం కోసం బిల్లు రూపొందించింది. అయితే ఆ వ్యవస్థ రద్దు చేశాక వారిని ఏంచేస్తారన్నది స్పష్టత రావాల్సిఉంది. వారి సేవలను రెవెన్యూ శాఖలోనే వినియోగించుకోవాలని… జూనియర్ అసిస్టెంట్లుగా కొనసాగించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

ట్రైబ్యునళ్ల ఏర్పాటు..

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా సేవలందేలా…. కొత్త రెవెన్యూ చట్టంలో నిబంధనలు పొందుపరచనున్నారు. అధికారుల విచక్షణాధికారాల వల్లే సమస్యలు తలెత్తుతున్నాయన్న భావనలో ఉన్న సర్కారు వాటికి కత్తెర వేయనుంది. తహసీల్దార్ మొదలు సంయుక్త కలెక్టర్ వరకు ఉన్న రెవెన్యూ కోర్టులను రద్దు చేయనున్నారు. భూవివాదాల పరిష్కారం కోసం ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయనున్నారు.33 జిల్లాల్లోనూ విశ్రాంత న్యాయమూర్తుల ఆధ్వర్యంలో అధికారులతో కూడిన ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో భూములకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలు తుది తీర్పు బహిర్గతం చేసే వరకు అన్ని స్థాయిల్లో వివరాలు పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకుంటారు. వీలైనంత వరకు సేవలను ఆన్‌లైన్ ద్వారానే అందించే ఏర్పాట్లు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సాగు భూముల రిజిస్ట్రేషన్ అధికారాలను తహసీల్దార్లకే కట్టబెడతారు. ఒకే రోజు రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. భూలావాదేవీలన్ని కోర్ బ్యాంకింగ్ విధానంలో జరిగేలా చర్యలు తీసుకుంటారు. ఇందుకు భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల బిల్లు 2020ని ప్రభుత్వం రూపొందించింది.

శాసన సభలో బిల్లులు

ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వేకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు సమాచారం. మొత్తంగా రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తూ సంస్కరణలు అమలు చేస్తూ రూపొందించిన బిల్లులను బుధవారం ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. వీఆర్వో వ్యవస్థ రద్దు, భూమిహక్కులు-పట్టాదారు పాసుపుస్తకాల బిల్లులను సీఎం కేసీఆర్ ప్రవేశపెడతారు. పురపాలక నిబంధనల చట్టసవరణ బిల్లును మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి ప్రవేశపెడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This