కుదుటపడుతున్న కశ్మీరం.. సవాళ్లను దాటి శాంతి దిశగా!

జమ్ముకశ్మీర్‌లో 370, 35ఏ అధికరణలను కేంద్రప్రభుత్వం రద్దుచేసి ఆగస్టు అయిదునాటికి ఏడాది పూర్తయింది. ఈ సాహసోపేత నిర్ణయం ఫలితంగా ఆ రాష్ట్రం ప్రత్యేకప్రతిపత్తి హోదాను కోల్పోయింది. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. ఏడు దశాబ్దాలుగా పాకిస్థాన్‌ ఉగ్రవాద, వేర్పాటువాద దురాగతాలకు బలవుతూ వచ్చిన జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి తొలగించిన చారిత్రక పరిణామం ఫలితంగా- ఏడాదిలో వచ్చిన సామాజిక, భద్రతాపరమైన మార్పులు తెలుసుకోవాలి. ఇప్పుడక్కడ సైన్యానిదే పైచేయి. కశ్మీర్‌ లోయలో భద్రత మెరుగైంది. వేర్పాటువాద కార్యకలాపాల అణచివేతలో, ఉగ్రవాద కార్యకలాపాల నిరోధంలో సాయుధ దళాలు ముందడుగు వేశాయి. జనవరి-జులై మధ్యకాలంలో సాయుధ బలగాలు 136మంది తీవ్రవాదుల ఆట కట్టించాయి.

హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ ఆపరేషనల్‌ కమాండర్‌ రియాజ్‌ నాయికూ, లష్కరే తొయిబాకు చెందిన హైజర్‌, జైషే మహ్మద్‌కు చెందిన ఖారీ యాసీన్‌, అన్సర్‌ ఘజ్యతుల్‌ హింద్‌ (ఏజీయు హెచ్‌)కు చెందిన బుర్హాన్‌ ఖోకా వంటి కరడుగట్టిన అగ్రశ్రేణి తీవ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది. 40-45 కిలోల పేలుడు పదార్థాలతో ఉన్న ఓ కారును స్వాధీనం చేసుకుని పుల్వామా తరహా దాడిని నివారించింది. ఎల్‌ఓసీ వెంబడి నౌషేరా వద్ద ముగ్గురు ఉగ్రవాదులను హతం చేసి భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనపరచుకొని అక్కడి చొరబాటు యత్నాలను వమ్ముచేసింది.

నిరసనలు తగ్గుముఖం

తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణ చర్యలు చేపడుతున్నా ఈ క్రమంలో జవానులూ ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో తీవ్రవాద దాడుల్లో జవాన్లు అమరులయ్యేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఉగ్రవాదులను హతమార్చడానికి జరుపుతున్న దాడుల్లో జవాన్లు వీరమరణం పొందుతున్నారు. నిఘా వర్గాల నిర్దిష్ట సమాచారం మేరకు భద్రతాదళాలు దాడులు నిర్వహిస్తున్నాయి. గతంలో ఇలా ఉండేది కాదు. ఏవో కొన్ని ప్రాంతాలను చుట్టుముట్టి, సోదాలు జరిపే సమయాల్లో తీవ్రవాదులు విరుచుకుపడి జవాన్లను పొట్టనపెట్టుకునేవారు. అందువల్ల అప్పట్లో జవాన్ల మరణాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. భద్రతాదళాల దాడుల వల్ల వేర్పాటువాద కార్యకలాపాలు క్షీణించాయి. తీవ్రవాద ముఠాలు స్థానికంగా చేపట్టే సభ్యుల నియామకం 40శాతం మేర క్షీణించింది. వేర్పాటువాదుల కార్యకలాపాలు, బందులు నామమాత్రంగా ఉంటున్నాయి. నిరుడు జనవరి-జులై మధ్యకాలంలో 30సార్లు బంద్‌కు పిలుపిచ్చారు. ఈ ఏడాది వాటి సంఖ్య నాలుగుకు మించలేదు. కొన్ని ప్రమాదకర వేర్పాటువాద ముఠాలు నామరూపాలు కోల్పోతున్నాయి. ఏపీహెచ్‌స్‌(జి) సంస్థ చైర్మన్‌ ఎస్‌ఏఎస్‌ జిలానీ పదవి నుంచి వైదొలడంతో కశ్మీర్లో రాళ్లు రువ్వే సంఘటనలు క్షీణించాయి. దీర్ఘకాలంలో కశ్మీర్‌ లోయలో శాంతి నెలకొల్పే దిశగా ఇవన్నీ బలమైన సంకేతాలు ఇస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This