ఘరానా మొగుడు​: ఒకేసారి భార్య-ప్రియురాలితో హనీమూన్​

కర్ణాటకలోని మంజునాథ్​.. తన భార్యతో కలిసి హనీమూన్​కు వెళ్లాడు. అయితే భార్య మీద ఏమాత్రం ఇష్టం లేని అతడు.. తన ప్రియురాలని కూడా అక్కడికే చేర్చాడు. వారిద్దరిని వేరువేరు గదుల్లో ఉంచాడు. భార్యను పక్కనపెట్టి.. ప్రియురాలితో ఊరంతా తిరిగాడు. భర్త వ్యవహారాన్ని ఆలస్యంగా గుర్తించిన భార్య.. చివరికి పోలీసులను ఆశ్రయించింది.

బసవనగుడి మహిళా ఠాణా పోలీసుల కథనం మేరకు.. బళ్లారికి చెందిన మంజునాథ్‌ సండూరులో పని చేసేవాడు. ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరుకు చెందిన యువతి(21)తో అతనికి వివాహమైంది. మొదటి నెల సండూరులో భార్యతో కలిసి ఉన్నాడు. ఆ తరువాత భార్యను పుట్టింట్లో వదిలి పెట్టాడు. వారాంతంలో నగరానికి వచ్చి వెళ్లేవాడు.

నమ్మించి వేరొకరితో..

మార్చి నెల రెండో వారంలో హనీమూన్‌ కోసం ఊటీకి వెళదామంటూ భార్యతో పయనమయ్యాడు. అంతకు ముందే తన ప్రియురాలిని ఊటీకి పంపించి, అక్కడి హోటల్‌లో తమ కోసం ఒక గదిని అదనంగా తీసుకున్నాడు. భార్యను హోటల్‌ గదిలో వదిలి పెట్టి, ప్రియురాలితో ఊరంతా చుట్టి వచ్చేవాడు. తన కార్యాలయం పని మీదే బయటకు వెళ్తున్నానంటూ ఆమెను నమ్మించాడు. వారం రోజులు అక్కడ గడిపాక నగరానికి తిరిగి వచ్చారు. మంజునాథ్‌ మళ్లీ సండూరులో ఉద్యోగానికి వెళ్లిపోయాడు. ప్రతి వారం నగరానికి వచ్చి వెళ్లేవాడు. ఈ నెల ప్రారంభంలో భర్త చరవాణిని పరిశీలించగా, తన ప్రియురాలితో కలిసి తీసుకున్న స్వీయచిత్రాలు కనిపించాయి. అవన్నీ ఊటీలోనివేనని గమనించి కంగుతింది.

భర్తను నిలదీయగా, ‘నువ్వు నాకు నచ్చలేదు. రూ.25 లక్షల నగదు ఇస్తేనే నీతో కలిసి ఉంటా’నని తేల్చి చెప్పాడు. అందుకు అంగీకరించని ఆమె తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకుని పరారైన మంజునాథ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This