కాబోయే భర్త పోస్ట్‌కు కాజల్‌ కామెంట్‌

అగ్ర కథానాయిక కాజల్‌ తనకు కాబోయే భర్త గౌతమ్‌ కిచ్లు సోషల్‌ మీడియా పోస్ట్‌కు చేసిన కామెంట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇంటీరియర్‌ డిజైనర్‌ అయిన గౌతమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు డిజైనింగ్‌కు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వ్యక్తిగత ఫొటోలు పంచుకున్నారు. తాజాగా ఆయన మొదటి సారి కాజల్‌తో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. ‘అంతంలేని ప్రేమ’ అనే అర్థం వచ్చే ఎమోజీని కూడా జత చేశారు. ఓ వేడుక సందర్భంగా అలంకరించిన ఫొటోను.. ఫొటో తీసిన దృశ్యమది. అయితే కేవలం వాళ్లను మాత్రమే కాకుండా.. వెనుక ఉన్న బెలూన్స్‌ కూడా కనపడేలా చిత్రాన్ని క్లిక్‌ మనిపించారు. దీంతో అలంకరణ కళపై ఆయనకున్న ఆసక్తిని ఉద్దేశించి కాజల్‌ కామెంట్‌ చేశారు. ‘ఈ పోస్ట్‌ కూడా డిజైన్‌ అంశాన్ని ప్రతిబింబిస్తోంది గౌతమ్‌ కిచ్లు.. కళాత్మక హృదయం ఉన్న నా ఫియాన్సీ’ అని పేర్కొన్నారు.

నిశ్చితార్థం సందర్భంగా తీసిన ఫొటో అదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు నెలలో కాజల్‌ ఇంట్లో నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. ఆమె ఓ వ్యాపారవేత్తను మనువాడనున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. వారం రోజుల క్రితం తన పెళ్లిపై కాజల్‌ క్లారిటీ ఇచ్చారు. అక్టోబరు 30న గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది ఆత్మీయుల సమక్షంలో ముంబయిలో శుభకార్యం జరగబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు ఆరంభమయ్యాయి. గత కొన్నేళ్లుగా కాజల్‌-గౌతమ్‌ మధ్య స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది. పలు సందర్భాల్లో ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This