కాన్పుర్​ ఎన్​కౌంటర్​ ఘటనపై రాజకీయ దుమారం

నేరగాళ్లపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉక్కుపాదం మోపుతున్న వేళ ఆ రాష్ట్రంలో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. కాన్పుర్‌లోని డిక్రూ గ్రామంలో 60 కేసులు నమోదైన హిస్టరీ షీటర్‌ వికాస్‌ దూబేను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై అతని అనుచరులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు తమను అరెస్టు చేసేందుకు వస్తున్నారని తెలుసుకున్న దుండగులు… ఓ ఇంటిపై మాటువేసి పోలీసు బృందంపై విచక్షణా రహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా 8మంది పోలీసులు అమరులయ్యారు. ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రౌడీ మూక కాల్పుల్లో ఒక పౌరుడు సహా ఏడుగురు గాయపడ్డారని… పోలీసుల ఆయుధాలు కూడా అదృశ్యమయ్యాయని అధికారులు తెలిపారు.

కాన్పుర్‌లో కాల్పులు జరిగిన ప్రాంతం అంతా భీతావహంగా మారింది. పోలీసుల బూట్లు, టోపీలు, రక్తపు మరకలతో ఘటనా ప్రాంతంగా భయానకంగా ఉంది. ఉత్తర్​ప్రదేశ్‌ అదనపు డీజీపీ, ఐజీ, కాన్పూర్‌ ఎస్పీ, సహా ఉన్నతాధికారులు,ఫోరెన్సిక్‌ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాల్పుల తర్వాత దుండగులు పారిపోగా, వారి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపును ముమ్మరం చేశారు.

రౌడీమూకల కాల్పుల్లో మరణించిన పోలీసు సిబ్బంది పార్ధీవ దేహాలకు… ఆదిత్యనాథ్‌ నివాళులు అర్పించారు. పోలీసుల మృతి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ హెచ్​.సి అవస్థీని ఆదేశించారు. ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, డీజీపీతో మాట్లాడిన ఆదిత్యనాథ్‌.. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని కోరారు. హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని… ఇతర జిల్లాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

“వికాస్‌దూబేపై 60 కేసులు ఉన్నాయి. అతడిపై హిస్టరీ షీట్‌ కూడా ఉంది. కరుడుగట్టిన నేరస్థుడైన వికాస్‌ దూబేను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. పోలీసులు రావడాన్ని చూసి దారికి అడ్డంగా జేసీబీని పెట్టి… పోలీసులు కిందకు దిగగానే దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఇదీ చాలా పెద్ద ఘటన. మా ముందు చాలా పెద్ద సవాలు ఉంది. నిందితులను పట్టుకునేందుకు జోన్‌లోని అన్ని జిల్లాలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాం. ఈ దుర్ఘటనను మేం చాలా సీరియస్‌గా తీసుకున్నాం. ”

-హెచ్‌.సి. అవస్థి, ఉత్తర్‌ప్రదేశ్‌ డీజీపీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This