గడ్డు పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సాధ్యమేనా?

జాతీయ స్థాయి పోటీ ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటుకుని, పేరెన్నికగన్న విద్యాసంస్థల్లో సీటు సంపాదించి, మేలిమి వైద్యులూ ఇంజినీర్లుగా పట్టా పొంది రావాలన్నది దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల కల. కరోనా మహమ్మారి నిశ్శబ్ద మృత్యుపాశాలు విసరుతూ భయానక వాతావరణం సృష్టించిన వేళ- విద్యార్థుల క్షేమానికి భరోసా ఇచ్చేలా ప్రవేశ పరీక్షల్ని నిర్వహించడం ఎలా? మొన్న ఏప్రిల్‌లోనే నిర్వహించాల్సిన జేఈఈ (మెయిన్‌), ఎన్‌ఈఈటీలను కొవిడ్‌ కారణంగా ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌ఏటీ)- విద్యా సంవత్సరానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉందంటూ సెప్టెంబరు ఒకటి నుంచి ప్రవేశ పరీక్షల కాల పట్టికను ప్రకటించింది. 8.58లక్షల మంది ఇంజినీరింగ్‌ అభ్యర్థులు హాజరయ్యే జేఈఈ (మెయిన్‌) పరీక్షా కేంద్రాల్ని 660కి, భౌతిక దూరం సాధ్యపడేలా షిఫ్టుల సంఖ్యను ఎనిమిది నుంచి పన్నెండుకు పెంచామని; పది లక్షల మాస్కులు, మరో పది లక్షల జతల చేతి తొడుగులు, వందల సంఖ్యలో ఇన్‌ఫ్రారెడ్‌ థర్మామీటర్లు, వేల లీటర్ల శానిటైజర్‌ సిద్ధం చేశామని ఎన్‌ఏటీ చెబుతోంది. ఈ పరీక్షల్ని వాయిదా వేస్తే విద్యార్థుల ‘కెరీర్’ బుగ్గిపాలవుతుందంటూ సంబంధిత వ్యాజ్యాల్ని సుప్రీంకోర్టు పదిరోజులక్రితం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడం తెలిసిందే. క్షేత్రస్థాయి వాస్తవాల్ని విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదంటూ ‘సుప్రీం’ను ఆశ్రయించిన ఆరు రాష్ట్రాల మంత్రుల తాజా వ్యాజ్యం- దేశవ్యాప్త ఆందోళనలకు ప్రతిధ్వనే! దేశీయంగా 345 జిల్లాల్లో ఏదో ఒక స్థాయిలో లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉండటంతో పరీక్షా కేంద్రాలకు రాకపోకలు కష్టమని, భారీ వరదలు ముంచెత్తిన బిహార్‌, గుజరాత్‌, అసోమ్‌లతోపాటు, కుంభవృష్టితో కుదేలైన కేరళ, జమ్మూకశ్మీర్‌లలో అంతర్జాల సమస్యలు వేధిస్తున్నాయన్న ఆందోళనల్ని తోసిపుచ్చే వీల్లేదు. ముందు నుయ్యి వెనక గొయ్యిలాంటి సంకటస్థితిలో ఉన్న విద్యార్థి లోకానికి సహేతుక పరిష్కారాల్ని అన్వేషించాలిప్పుడు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This