అమరావతిలో తక్షణమే పనులు ప్రారంభించాలి: సీఎం జగన్

అమరావతిలో తక్షణమే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ) అధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు స్పష్టతనిచ్చారని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతి ప్రాంతంలో వివిధ దశల్లో నిలిచిన పనులను పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ గురువారం సమీక్షించారు. నిధుల సమీకరణకు అవసరమైన ప్రణాళికను ఆర్థిక శాఖ అధికారులతో కలిసి కూర్చుని రూపొందించుకోవాలని ఏఎంఆర్‌డీఏ అధికారులకు సూచించారని, ‘హ్యాపీనెస్ట్‌’ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఒక ప్రకటనలో తెలిపింది. సీఆర్‌డీఏను రద్దు చేసి ఏఎంఆర్‌డీఏను ఏర్పాటుచేస్తూ చట్టం తెచ్చాక ముఖ్యమంత్రి సమీక్షించడం ఇదే మొదటిసారి. సీఎంతో జరిగిన సమావేశం వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయంలో విలేకరులకు తెలిపారు.

రాష్ట్రంలో అమరావతి అంతర్భాగం. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని శాసన రాజధానిగా ప్రకటించింది. 13 జిల్లాల అభివృద్ధిలో భాగంగా అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సీఎం నెల కిందట నిర్వహించిన సమీక్షలో చర్చించారు. నేను, అధికారులు అమరావతిలో పర్యటించి అన్ని పనులనూ చూశాక కార్యాచరణ రూపొందించి ఆయనకు నివేదించాం. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మన బాధ్యతని, తక్షణమే పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. త్వరలోనే కార్యక్రమాలు చేపడతాం- బొత్స సత్యనారాయణ, మంత్రి

  • విలేకరి: అమరావతిలో అసంపూర్తి భవనాలను నిర్మించి ఏం చేస్తారు?

బొత్స: మా వద్ద ప్రణాళిక ఉంది. పనులు పూర్తి చేసేందుకు ఎంత బడ్జెట్‌ కావాలన్నది అవసరాలను బట్టి నిర్ణయిస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో సౌకర్యాలు కల్పిస్తాం. గత ప్రభుత్వమిచ్చిన హామీ మేరకు రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలనిస్తాం. ఖర్చు రూ.వెయ్యి కోట్లు కావొచ్చు.. రూ.10 వేల కోట్లయినా కావొచ్చు. ఆర్భాటం చేయబోం. అప్పులు చేయం. లేనిపోని గ్రాఫిక్స్‌ మాత్రం చూపించం

  • విలేకరి: మూడు రాజధానులను సవాలు చేస్తూ కోర్టులో కేసులు ఉన్నాయి కదా?

బొత్స: పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలిపిన వెంటనే 3 రాజధానులకు శంకుస్థాపన చేద్దామనుకున్నాం. తెదేపా వంటి దుష్ట శక్తులు అడ్డుకున్నాయి. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటాం. 3 రాజధానుల శంకుస్థాపన మాత్రం జరుగుతుంది. అది ఆగస్టు పదిహేనునా? దసరాకా? మరో పండగ రోజునా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది

  • విలేకరి: శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానిస్తున్నారా?

బొత్స: రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే.. ప్రధానిని, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలుస్తాం. 13 జిల్లాలను ఒకే దృక్పథంతో అభివృద్ధి చేస్తున్నప్పుడు ప్రధాని సహా దేశంలోని పెద్దలందరికీ ఆహ్వానాలు పంపడం సంప్రదాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This