‘అప్పుడు ఉపన్యాసలు దంచిన జగన్​.. ఇప్పుడు చేస్తున్నదేంటి?’

గత ప్రభుత్వం కన్నా…వైకాపా హయాంలో రాష్ట్ర ఆదాయం అధికమైనా… అభివృద్ధి మాత్రం లేదని, సంక్షేమాన్ని కుదించారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి, అరాచకాలు పేట్రేగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా దుర్మార్గాలతో రాష్ట్రానికి కీడు, ప్రజలకు చేటు ఏర్పడిందన్నారు. వాటిని తెలియజేసేందుకే ప్రజలకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏడాదిగా రైతుల సమస్యలు పరిష్కరించలేక పోయారని.. అప్పుల పాలైన రైతులను ఆదుకునే చర్యలు శూన్యమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

పేదల కోసం గతంలో తమ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేశారని తెదేపా అధినేత ధ్వజమెత్తారు. కరోనా ఉపశమన చర్యల్లో ఘోరంగా విఫలమయ్యారని ఆక్షేపించారు. ప్రజలపై రూ.50వేల కోట్ల భారం మోపారాని.. 87వేల కోట్లు అప్పులు చేశారని దుయ్యబట్టారు. కరెంటు బిల్లులు, మద్యం ధరలు, ఇసుక, సిమెంటు రేట్లు విపరీతంగా పెంచేశారని ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో 70మంది భవన కార్మికులు, 600మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. 1.8లక్షల కోట్ల పెట్టుబడులు తరిమేయడంతో నిరుద్యోగం పెరిగిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏడాది పాలనలో వైకాపా లోటుపాట్లను ఎత్తిచూపితే తప్పులు చక్కదిద్దకుండా తమపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చడానికే విధ్వంసాలకు పాల్పడుతున్నారని, ప్రత్యర్థులపై ప్రతీకారమే వైకాపా లక్ష్యంగా పనిచేస్తుందని మండిపడ్డారు. సీఎంగా జగన్ ప్రమాణం చేసిన రోజు నుంచే తెదేపాపై కక్ష సాధింపు చేస్తున్నారని.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే ప్రజావేదికను కూల్చేశారన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తల ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, వ్యాపారాలకు నష్టం చేయడమే వైకాపా లక్ష్యమని దుయ్యబట్టారు.

బెదిరించి, ప్రలోభపరిచి, లొంగదీసుకోవడమే వైకాపా దుష్టసిద్దాంతమని చంద్రబాబు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా గ్రానైట్ గనుల యజమానులపై 2వేల కోట్ల జరిమానాలు విధించారని విమర్శించారు. నెల్లూరులో తెదేపా మైనారిటీ నాయకుల ఇళ్లు కూల్చేశారన్నారు. పల్నాడులో వైకాపా నేతల దాడులతో తెదేపా కార్యకర్తలను ఊళ్లలో నుంచి తరిమేశారని ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు చేశారని తెదేపా అధినేత మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో దాడులు, దౌర్జన్యాలతో భయోత్పాతం సృష్టిస్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This