10 రోజులపాటు రోజుకో పథకం

అర్హులై ఉండి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోయిన వారికి, తాజా దరఖాస్తుదారులకు శుక్రవారం నుంచి వరుసగా 10 రోజులపాటు సాయమందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రజాసంకల్ప పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం మంత్రిమండలి సమావేశం అనంతరం సీఎం మంత్రులతో కాసేపు చర్చించి, కొన్ని అంశాలపై సూచనలు చేశారు.

* స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాలో డీఎడ్‌ కోర్సులో చేరిన 27 వేల మంది విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం లేకుండా పోయిందని మంత్రి విశ్వరూప్‌ వివరించగా.. ఈ ఏడాదివరకు పరీక్షలకు అనుమతించేలా చూడాలని సీఎం చెప్పారు.

* పాఠశాలలు తెరవడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకూ కరోనా సోకుతోందని పలువురు మంత్రులు ప్రస్తావించగా ‘ఎక్కడో ఒకచోట పాఠశాలలు ప్రారంభం కావాలి కదా? అందుకే రోజుమార్చి నిర్వహిస్తున్నాం. పిల్లలకు హాజరు తప్పనిసరని పెట్టలేదుగా’ అని సీఎం అన్నారు.

* అనంతపురంజిల్లాలో వేరుసెనగ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి శంకరనారాయణ తెలిపారు. సీఎం స్పందిస్తూ నివేదిక తెప్పించి, రైతులకు అండగా నిలవాలని ఆదేశించారు.

* నిజాంపట్నం, జువ్వలదిన్నె, ఉప్పాడ, మచిలీపట్నంలలో ఏర్పాటు చేయదలచిన చేపల రేవులకు ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా శంకుస్థాపన చేస్తే బాగుంటుందని మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రిని కోరారు. ‘ఇంకా టెండరు స్థాయిలో ఉన్నాయి కదా? అప్పటికి ప్రక్రియ కొలిక్కి వస్తే ఆలోచిద్దాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This