‘సామాజిక అంశాలపై క్రీడాకారులు అందుకే స్పందించరు’

సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంశాలపై క్రీడా ప్రముఖులు చాలా అరుదుగా స్పందిస్తారని, వారికున్న అభద్రతాభావమే అందుకు కారణమని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. ప్రతిఒక్కరికీ వాస్తవిక దృక్పథమూ ఉండాలని సూచించాడు. ‘బియాండ్‌ ద ఫీల్డ్‌’ అనే ఆన్‌లైన్‌ కార్యక్రమంలో మాట్లాడిన అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు.

“ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, దేశానికి అత్యున్నత స్థాయిలో సేవలందించిన ఆటగాడిగా మనమంతా ఐక్యంగా ఉండాలనే కోరుకుంటా. నా వ్యక్తిగత జీవితం ఎవరికీ తెలియకుండా ఉండాలని అనుకుంటా కానీ, నా ఆలోచనలను మాత్రం ప్రజలతో పంచుకుంటా. తద్వారా దేశం బాగుపడుతుందని భావిస్తా. అదే విధంగా జామియా ఘటనపై స్పందించాను. సహజంగా ఎవరైనా క్రీడా ప్రముఖులు లేదా క్రికెటర్లు సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపై స్పందించొచ్చు. అదే దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. అలా కాకుండా నా దేశం గొప్పదని నినాదాలు చేస్తే లాభం లేదు. మన మాటలతోపాటే నడవాలి. ఇలా సున్నితమైన అంశాలపై ఇతరులెందుకు స్పందించరని అడిగితే వారికి అభద్రతాభావం ఉంటుందని నా అభిప్రాయం. ఉదాహరణకు ప్రత్యర్థి జట్టును ఒక వ్యాఖ్యాత పొగిడాడంటే.. ఓ సినీతార అతడికి వ్యతిరేకంగా ట్వీట్‌ చేస్తే ఆ ఉద్యోగం పోతుంది. కాబట్టి వాళ్లకు భరోసా కల్పిస్తే ఎవరైనా బయటకొచ్చి మాట్లాడతారు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This