సన్​రైజర్స్ మిడిల్ ఆర్డర్ వ్యూహం ఫలిస్తుందా!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న జట్టు. బౌలింగ్ విభాగంలో మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తూ గత ఐదేళ్లుగా ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తోంది. 2016లో ట్రోఫీని సొంతం చేసుకుంది. మూడు సార్లు ఆరెంజ్​ క్యాప్​ను సంపాదించుకుంది. అయినప్పటికీ జట్టులోని కొన్ని లోపాల కారణంగా ఒత్తిడికి గురై విఫలమవుతోంది. ముఖ్యంగా మిడిల్​ ఆర్డర్​ సమస్య బాగా వెంటాడుతుందనే చెప్పాలి. ఓపెనర్లు వార్నర్, బెయిర్‌ స్టో ఆట తీరుపైనే జట్టు అధారపడుతూ నెట్టుకొస్తుంది. అయితే ఈ సీజన్​లో ఆ సమస్యను అధిగమించడానికి ప్రత్యేక దృష్టి సారించామని ఇటీవల చెప్పాడు జట్టు మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌. టైటిల్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. మరీ వీవీఎస్​ వ్యూహం ఈ సారి లీగ్​లో ఫలించనుందా? ఎస్​ఆర్​హెచ్​ ట్రోఫీని ఎగరేసుకుపోతుందా? వంటి అంశాల సమాహారమే ఈ కథనం.

ఈసారి వార్నర్​-బెయిర్ స్టో భాగస్వామ్యం

గత ఐపీఎల్​లో టాప్‌-4లో నిలిచింది సన్​రైజర్స్​. సారథి వార్నర్​, బెయిర్ స్టో భాగస్వామ్యం ఈ ఘనతకు కారణం. వార్నర్​.. గతేడాది 12 మ్యాచుల్లో 692 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి. 2015- 2017 కాలంలో మొత్తం 45 మ్యాచ్​లకు కెప్టెన్​గా చేశాడు. 2016లో జట్టును విజేతగా నిలిపాడు. మొత్తంగా సారథిగా 47 మ్యాచ్​లకు ప్రాతినిధ్యం వహించగా.. 26 సార్లు విజయం, 21 సార్లు ఓటమిని అందించాడు. విజయశాతం 55.31గా ఉంది.

కాగా, బెయిర్​​ స్టో గత సీజన్​లో 10 మ్యాచుల్లో 445 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు, ఒక శతకం ఉన్నాయి. కాబట్టి ఈ ఏడాదీ లీగ్​లోనూ వీరిద్దరి భాగస్వామ్యం జట్టుకు విజయాన్ని అందించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This