ఐదుగురు భారతీయులకు ఐరాస ప్రతిష్ఠాత్మక పురస్కారం

ఐదుగురు భారతీయులను మరణానంతరం ప్రతిష్ఠాత్మక డ్యాగ్​ హామ్మర్స్​జోల్డ్ మెడల్​తో సత్కరించనుంది ఐక్యరాజ్యసమితి. 2019లో యూఎన్ పీస్​ కీపింగ్ మిషన్లలో భాగంగా సేవలందిస్తూ ప్రాణాలు వదిలిన వీరికి ఈ అవార్డును ప్రదానం చేయనుంది. ఈ ఐదుగురితో పాటు మిలిటరీ, పోలీసు, సామాన్య ప్రజలు మొత్తం 83 మందికి ఈ మెడల్​ ఇవ్వనుంది. విధుల్లో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడిన వీరందరినీ అంతర్జాతీయ యూఎన్​ పీస్​ కీపర్స్​ డే సందర్భంగా ఈనెల 29న మరోమారు గుర్తు చేసుకోనుంది ఐరాస.

ఐదుగురు వీరే..

దక్షిణ సూడాన్​లో యూఎన్​ మిషన్​ కోసం పని చేసిన మేజర్​ రవి ఇందర్​ సింగ్​ సంధు, సార్జెంట్​​ లాల్​ మనోత్రా టార్సెమ్​, లెబనాన్​లో విధులు నిర్వర్తించిన సార్జెంట్​​ రమేశ్​ సింగ్​, కాంగోలో పనిచేసిన ఎడ్వర్డ్​ అగాపిటో పింటో, ప్రైవేట్​ జాన్సన్​ బెక్​లు మరణానంతరం ఈ అవార్డును దక్కించుకున్నారు.

మరో భారత మేజర్​కూ అవార్డు..

భారత ఆర్మీ మేజర్​ సుమన్​ గవానీని 2019 ఏడాదికిగానూ ‘యునైటెడ్​ నేషన్స్​ మిలిటరీ జెండర్​ అడ్వకేట్​ ఆఫ్​ ద ఇయర్’​ అవార్డుతో సత్కరించనుంది యూఎన్​. ఈ అవార్డు ఓ భారతీయురాలికి దక్కడం ఇదే ప్రథమం. మే 29న ఈ అవార్డును అందుకోనున్నారు గవానీ.

యూఎన్​ పీస్​ కీపింగ్​కు ఎక్కువ మంది సైనికులకు అందిస్తున్న ఐదో అతిపెద్ద దేశం భారత్​. ప్రస్తుతం అబెయి, సిప్రస్, కాంగో, లెబనాన్​, పశ్చిమాసియా, సూడాన్​, దక్షిణ సూడాన్​, సొమాలియా, వెస్టెర్న్​ సహారాలో యూఎన్​ పీస్​ కీపింగ్​ కార్యకలాపాలకు మొత్తం 5,400 మందికిపైగా పోలీసు, సైనిక బలగాల సాయాన్ని అందించింది భారత్​.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This