2020 రివ్యూ: భారత్​ వ్యూహాత్మక ప్రస్థానం

2020 సంవత్సరం.. గడచిన వందేళ్లలో ఇంతలా చరిత్ర గతిని మార్చేసిన, మార్చేయబోతున్న సంవత్సరం మరొకటి లేదు. కరోనా మహమ్మారిని వెంట తీసుకొచ్చిన ఈ సంవత్సరం మనకు తెలిసిన జీవితాన్ని తలకిందులు చేసింది. ప్రపంచమంతా ఆ వైరస్‌ను కట్టడి చేయడానికి సతమతమవుతుంటే, ఇదే సందు అనుకుని చైనా భారత సరిహద్దులో చొరబాట్లకు దిగింది. మే నెలలో తూర్పు లద్దాఖ్‌లో పాంగాంగ్‌ సరస్సు వద్ద రెండు దేశాల సైనికులు ముఖాముఖి తలపడ్డారు. తరవాత జూన్‌లో చైనీయుల దొంగదాడిలో 20మంది భారత జవాన్లు మరణించారు. చైనా పక్షాన భారీ ప్రాణనష్టం జరిగినా, బీజింగ్‌ వివరాలు బయటపెట్టలేదు. తూర్పు, దక్షిణ చైనా సముద్రాలు మొదలుకొని హిమాలయాల వరకు చైనా దుందుడుకు పోకడలు పేట్రేగాయి. దీంతో ఇంతకాలం కాగితాలపైనే ఉన్న చతుర్భుజి(క్వాడ్‌)ని వ్యూహపరంగా ముందుకు తీసుకెళ్లడానికి అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ అడుగులు వేస్తున్నాయి. క్వాడ్‌ సభ్యులైన భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబెలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశ ప్రతిష్ఠాత్మక పురస్కారమైన లీజియన్‌ ఆఫ్‌ మెరిట్‌ను ప్రకటించారు. ఇది చైనా దూకుడుకు పగ్గాలు వేయాలన్న అగ్రరాజ్య తపనకు అద్దం పడుతోంది.

బీజింగ్‌ పన్నాగాలకు ‘క్వాడ్‌’తో కళ్లెం!..

క్వాడ్‌ ప్రధానంగా చైనాపై ఎక్కుపెట్టినదే అయినా, ఇది భారత్‌ చిరకాల నేస్తం రష్యాకు ఆందోళన కలిగిస్తోంది. దిల్లీ ఇక అమెరికా ప్రాబల్యంలోకి వెళ్లిపోతుందని మాస్కో కలవరం. అమెరికా సైతం భారత్‌ మీమాంస విడిచిపెట్టి చైనాతో నేరుగా ఢీకొనాలని తొందరపెడుతోంది. ప్రస్తుతం సంప్రదింపుల వేదికగా ఉన్న క్వాడ్‌ ఇక సాధికారంగా వ్యవస్థాగత రూపం ధరించడమే తరువాయి. మరోవైపు అమెరికా స్థానంలో తానే అగ్రరాజ్యంగా ఎదగాలని చైనా ఆరాటపడుతోంది. తన విస్తరణ కాంక్షకు భారత్‌ అడ్డుతగిలే అవకాశం ఉంది కాబట్టి మన పొరుగు దేశాలను దూరం చేయాలని చూస్తోంది. భారత్‌కు అత్యంత సన్నిహిత నేస్తమైన నేపాల్‌లో బీజింగ్‌ పన్నాగాలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. వీటిని భగ్నం చేయడానికి భారతదేశమూ బరిలో దిగింది. నేపాల్‌తో భౌగోళిక విభేదాలను పరిష్కరించుకోవడానికి భారత ప్రభుత్వ ప్రతినిధులు నేపాలీ సర్కారుతో చర్చలు జరుపుతున్నారు. బ్రహ్మపుత్ర మీద 60 గిగావాట్ల భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మించడానికి చైనా సమాయత్తం కావడం భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌కూ ఆందోళనకరమే. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద డామ్‌ అయిన త్రీగోర్జెస్‌నూ మించిపోనున్న బ్రహ్మపుత్ర ప్రాజెక్టుకు చైనా కొత్త పంచవర్ష ప్రణాళికలో స్థానం కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు బంగ్లాను ఆర్థికంగా దెబ్బతీసి, లక్షల సంఖ్యలో శరణార్థులు భారత్‌కు వలస వచ్చేలా పురిగొల్పుతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ను తమ ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో కీలక భాగస్వామిగా చేర్చుకోవాలనుకొంటున్నామని అమెరికా ప్రకటించింది. నేపాల్‌కు 50 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రతిపాదించడం ద్వారా ఆ దేశం చైనా పరిధిలోకి వెళ్లిపోకుండా అడ్డుకోవాలని చూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This