అవినీతిలో ఆసియా కప్పు మనదే!

అవినీతి అంతానికి పంతం పట్టినట్లు అందరూ చెబుతున్నా వాస్తవంలో ఎవరూ ఏమీ చెయ్యలేకపోతున్నారని సర్వోన్నత న్యాయస్థానమే లోగడ నిస్పృహతో స్పందించింది. యూపీఏ జమానాలో అవినీతి తాళ ప్రమాణాలకు చేరినప్పుడు అన్నా హజారే సారథ్యంలో సాగిన జనాందోళన లోక్‌పాల్‌ వ్యవస్థ ఏర్పాటును కోరి సాధించుకొన్నా- దాని ఉనికీ మనికీ నేటికీ ప్రశ్నార్థకంగానే మిగిలాయి.

పాలన యంత్రాంగంలో అవినీతి సగటు మనిషి జీవనాన్ని దుర్భర దుఃఖ భాజనం చేస్తున్న వాస్తవం కళ్లకు కడుతున్న నేపథ్యంలో- ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ అధ్యయనం 39శాతం లంచాల రేటుతో ఇండియా ఆసియాలోనే అధ్వాన స్థితిలో ఉందని తాజాగా నివేదించింది. పౌర సేవలు పొందాలంటే వ్యక్తిగత పరిచయాలుండటమో, లేదంటే లంచాలు ముట్టజెప్పడమో తప్పనిసరి అవుతోందన్నది ఆ సంస్థ అధ్యయన సారాంశం. ఆసియాలోని 17 దేశాల పనిపోకడల్ని వడగట్టి రూపొందించిన నివేదిక కాంబోడియా, ఇండొనేసియాలు ఇండియా తదుపరి స్థానాల్లో ఉన్నాయని, మాల్దీవులు జపాన్లలో ఆమ్యామ్యాల రేటు అత్యల్పమనీ ముక్తాయించడం గమనార్హం.

ఈ ఏడాది మొదట్లో అవినీతి సూచీలో రెండు స్థానాలు దిగజారి 80వ ర్యాంకునకు పరిమితమైన ఇండియాలో సుపరిపాలన అక్షరాలా ఎండమావినే తలపిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ధాటిగా రాకపోవడానికి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఈసురోమంటుండటానికి, ప్రగతి లక్ష్యాలు గురి తప్పడానికి, మొత్తమ్మీద మానవాభివృద్ధి సూచీల్లో ఇండియా మొహం వేలాడేయడానికీ సర్వవ్యాప్తమైన అవినీతే పుణ్యం కట్టుకొంటోంది. ఎన్నికల రంగంలో ధన ప్రభావం అత్యధికంగా ఉండి. ప్రభుత్వాల చెంత సంపన్నుల మాటే చలామణీ అయ్యే దేశాల్లో అవినీతి విచ్చలవిడిగా ఉందన్న విశ్లేషణ- అన్ని రకాల అవినీతికీ తల్లివేరు రాజకీయ అవినీతేనని ధ్రువీకరిస్తోంది. దర్యాప్తు నిఘా వ్యవస్థల్ని పాలక పక్షాల పెంపుడు జాగిలాలుగా మార్చి, కాలం చెల్లిన విచారణ పద్ధతులతో కోర్టుల్లో కేసుల్ని కొండల్లా పేర్చి, అవినీతిపరులకు అదృశ్య రక్షాకవచాలు తొడిగిన అవ్యవస్థ- ప్రజాజీవనాన్ని సంక్షుభితం చేస్తోంది!

ప్రసూతి కోసం భార్యను ప్రభుత్వాసుపత్రిలో చేర్చడానికి లంచం ఇచ్చే స్థోమత లేక బిడ్డతో సహా రైలుకిందపడి ఆత్మహత్య చేసుకొన్న ఓ అభాగ్యుడి ఉదంతం- అవినీతి ఎంత ప్రాణాంతకంగా కోరసాచిందో వెల్లడిస్తోంది. అవినీతి నేతలు, బ్యూరోక్రాట్లు, వ్యాపారస్తులు, ఎన్‌జీఓలు, నేరగాళ్ల మధ్య పెనవడిన అక్రమ బాంధవ్యం దేశాన్ని అవినీతి విష పరిష్వంగంలోకి ఈడ్చేసిందని కేంద్ర నిఘా సంఘం అధిపతిగా విశ్లేషించిన నాగరాజన్‌ విఠల్‌- ఆ మహమ్మారిని మట్టగించే 13 సూత్రాల విపుల కార్యాచరణ ప్రతిపాదించి రెండు దశాబ్దాలైంది.

కాలం చెల్లిన చట్టాలు, బ్యూరోక్రసీ దుర్విచక్షణాధికారాలూ అవినీతికి ఆజ్యం పోస్తున్నాయన్న విఠల్‌- అవినీతిపై సమరానికి యువతను సన్నద్ధం చేసేలా నేషనల్‌ విజిలెన్స్‌ కోర్‌ (ఎన్‌వీసీ) ఏర్పాటు, విజిల్‌ బ్లోయర్‌ యాక్ట్‌ను అమలులోకి తెచ్చి గూడుపుఠాణీల్ని బయటపెట్టే పౌరులకు చట్టబద్ధ రక్షణలు కల్పించాలనీ సూచించారు. అధికారులపై దర్యాప్తు జరపాలంటే ముందస్తు అనుమతులు పొందాలన్న నిబంధనలు- అవినీతి మోతుబరులకు రక్షాబంధనాలవుతున్నాయి. ఏటా రూ.800 కోట్ల ప్రజాధనంతో నడుస్తున్న కేదస (సీబీఐ) రికార్డును గమనిస్తే- మన వ్యవస్థలు ఎంత నేలబారుగా అఘోరిస్తున్నదీ బోధపడుతుంది. స్థిర సంకల్పం ఉండాలేగాని అవినీతి కాళియ మర్దనం ఎలా జరపాలో హాంకాంగ్‌, సింగపూర్‌, ఫ్రాన్స్‌, ఇటలీ అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రజల నెత్తిన ఎక్కి తొక్కడానికా మూడు అంచెలవారీగా పాలన యంత్రాంగాల్ని ఏర్పాటు చేసుకొంది? కరోనా సంక్షోభ వేళా బీదసాదలకు అందాల్సిన సరఫరాల్నీ కైంకర్యం చేస్తున్న అవినీతి- సంక్షేమ రాజ్య భావనకే తూట్లు పొడుస్తోంది. అవినీతి శృంఖలాల్ని తెగతెంచి దేశానికి అసలైన స్వాతంత్య్రం తెచ్చేందుకు జాగృత యువ జనవాహిని కదలాల్సిన సమయమిది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This