సరిహద్దుల నుంచి వైదొలగాల్సిందే!

తూర్పు లద్దాఖ్​లోని సరిహద్దు ప్రాంతాల నుంచి చైనా బలగాలు పూర్తిగా వైదొలగాల్సిందేనని భారత్​ మరోసారి గట్టిగా స్పష్టం చేసింది. రెండు దేశాల అగ్రశ్రేణి సైనిక కమాండర్ల సమావేశంలో ఈ డిమాండ్​ చేసింది. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు రెండు దేశాల మధ్య కుదిరిన ఐదు సూత్రాల ఒప్పందం అమలుపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించారు.

భారత్, చైనాల మధ్య మే నెలలో ఉద్రిక్తతలు మొదలయ్యాక కోర్​ కమాండర్ల స్థాయిలో చర్చలు జరగడం ఇది ఆరోసారి. చూషుల్​ సెక్టార్​లో చైనా ఆధీనంలోని మోల్దోలో సోమవారం ఉదయం 10గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు చర్చలు జరిగాయి. మొత్త మీద 13 గంటల పాటు సాగిన చర్చల్లో.. భారత్​ బృందానికి లేహ్​ కేంద్రంగా పని చేసే 14 కోర్​ అధిపతి లెఫ్టినెంట్​ జనరల్​ హరీందర్​ సింగ్​ నాయకత్వం వహించారు. ఈ బృందంలో విదేశీ వ్యవహారాల శాఖలో సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ కూడా ఉన్నారు. కోర్​ కమాండర్​ స్థాయి చర్చల్లో విదేశాంగ శాఖ అధికారి పాల్గొనడం ఇదే తొలిసారి. వచ్చే నెలలో ’14 కోర్​’ నాయకత్వ బాధ్యతలు చేపట్టే లెఫ్టినెంట్​ జనరల్​ పీజీకే మేనన్​ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. చైనా బృందానికి దక్షిణ షిన్​జియాగ్​ సైనిక ప్రాంత కమాండర్​ మేజర్​ జనరల్​ లియు లిన్​ నాయకత్వం వహించారు.

ఈ నెల 10న మాస్కోలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్​సీఓ)లో భారత్​, చైనా విదేశాంగ మంత్రుల సమావేశంలో ఐదు సూత్రాల ఒప్పందం కుదిరింది. దాన్ని నిర్దిష్ట కాలావధిలోగా అమలు చేయాలని భారత్​ బృందం తాజా భేటీలో గట్టిగా డిమాండ్​ చేసినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో శాంతి నెలకొనాలంటే.. చైనా సైన్యం త్వరగా, పూర్తిగా వైదొలగాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు ఘర్షణలకు కేంద్ర బిందువులుగా ఉన్న పాంగాంగ్​ సరస్సు దక్షిణ , ఉత్తర రేవులు, ఇతర ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని సైనిక వర్గాలు తెలిపాయి. కొన్ని చోట్ల రెండు దేశాల సైనికులు మధ్య దూరం 300 మీటర్ల కన్నా తక్కువే ఉంది. చైనా మోహరింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కొత్తగా ఒక సైనిక డివిజన్​(12 వేలమంది సైనికులు)ను దించాలని భారత్​ యోచిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This