ఇండియా మరియు బంగ్లా మొదటి 20‌లో టర్నింగ్ పాయింట్

బంగ్లాదేశ్‌తో ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు ఆఖరి వరకూ గెలిచేలా కనిపించింది. కానీ.. ఒక్క తప్పిదం అనూహ్యంగా మ్యాచ్‌ని టీమిండియాకి దూరం చేసేసింది. క్యాచ్‌లు మ్యాచ్‌ల్ని గెలిపిస్తాయంటారు.. ఒకవేళ ఆ క్యాచ్ వదిలేస్తే మ్యాచ్‌‌ని కూడా వదిలేసినట్లేనని భారత్‌కి మరోసారి ఢిల్లీ టీ20 గుర్తు చేసింది.

149 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ విజయానికి చివరి 16 బంతుల్లో 35 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో చాహల్ విసిరిన బంతిని ముష్ఫికర్ రహీమ్ సిక్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ.. షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాకపోవడంతో బౌండరీ లైన్ వద్ద బంతి సులువుగా కృనాల్‌ పాండ్యాకి చేతికి చిక్కేలా కనిపించింది. కానీ.. సులువుగా అందుకోవాల్సిన క్యాచ్‌ని తత్తరపాటులో కృనాల్‌ పాండ్య నేలపాలు చేశాడు. దీంతో.. బంతి అతని చేతుల్ని తాకి బౌండరీకి వెళ్లింది. భారత్‌కి మ్యాచ్ చేజారిందక్కడే. ఒకవేళ ఆ క్యాచ్ పట్టింటే కచ్చితంగా బంగ్లాదేశ్ ఒత్తిడిలోకి వెళ్లేది.

18వ ఓవర్ ముగిసే సమయానికి సమీకరణం 12 బంతుల్లో 22 పరుగులుగా మారిపోగా.. జీవనదానంతో మరింత రెచ్చిపోయిన ముష్ఫికర్ రహీమ్ (60 నాటౌట్: 43 బంతుల్లో 8×4, 1×6) 19వ ఓవర్‌లో బౌండరీల మోత మోగించాడు. లయ తప్పిన ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 4, 4 బాదేసిన ముష్ఫికర్ రహీమ్.. ఆ ఓవర్ ముగిసే సమయానికి సమీకరణాన్ని 6 బంతుల్లో 4 పరుగులుగా మార్చేశాడు. ఆఖరి ఓవర్‌లోనూ మూడో బంతికి చూడచక్కని సిక్స్‌తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. సులువుగా అందుకోవాల్సిన క్యాచ్‌ని జారవిడిచిన భారత్ భారీగా మూల్యం చెల్లించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This