పాక్​లో రాజకీయ అస్థిరత.. ఇరకాటంలో ఇమ్రాన్​

బలహీన నాయకత్వం ఉన్నచోట రాజకీయ అస్థిరత ఎంతగా ప్రబలుతుందో చెప్పడానికి పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ నిలువెత్తు నిదర్శనం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు ఆయనకు చికాకులు కలిగిస్తున్నాయి. ఈ మాజీ క్రికెటర్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తోంది. తాజాగా ఆయన రాజీనామా చేయాలంటూ జరిగిన ఆజాదీ మార్చ్‌ (స్వేచ్ఛా ప్రదర్శన) ప్రకంపనలు సృష్టిస్తోంది.

కరడుగట్టిన ఇస్లామిక్‌వాది మౌలానా ఫజ్లుర్‌ రెహ్మాన్‌ నేతృత్వంలోని జమియత్‌ ఉలేమా-ఎ-ఇస్లాం (ఎఫ్‌) ఈ ప్రదర్శన నిర్వహించింది. కరాచీలో గత నెల 27న మొదలైన ప్రదర్శన 31న రాజధాని నగరం ఇస్లామాబాద్‌కు చేరుకుంది. దీంతో ఆందోళన చెందుతున్న ఇమ్రాన్‌ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. చర్చలకు సిద్ధమేనని అయితే రాజీనామా చేసే ప్రసక్తిలేదని ఆయన స్పష్టీకరించారు. ఆందోళనకారులూ పట్టుదలతో ఉన్నారు. ఆందోళనను ‘ధర్నా’గా మార్చినట్లు వారు ప్రకటించారు.

సైన్యం ప్రమేయం బహిరంగ రహస్యమే

మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై జైల్లో విష ప్రయోగం చేశారనే ఆరోపణలు వచ్చినప్పుడే ఈ ప్రదర్శన జరగడంతో ఇమ్రాన్‌ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. పాకిస్థాన్‌లో ఈ తరహాలో జరిగే ఆందోళనలకు ప్రభుత్వాలను పడగొట్టిన చరిత్ర ఉంది.

దేశంలో సైన్యం ప్రమేయం లేకుండా చీమ చిటుక్కుమనదు. అసలు సైన్యమే ఇటువంటి ఉద్యమాలకు ఊపిరులు ఊదుతుంటుందన్న ఆరోపణలూ ఉన్నాయి. సైన్యంతో గతంలో ఆసిఫ్‌ అలీ జర్దారీ సర్కారుకు విభేదాలు రాగానే 2012లో మహమ్మద్‌ తాహ్రి ఉల్‌ ఖాద్రీ అనే మాజీ ఆచార్యుడు ‘మిలియన్‌ మెన్‌ మార్చ్‌’ పేరుతో ప్రభుత్వ అవినీతిపై ఉద్యమం ప్రారంభించారు. ఆ తరవాత అధికారం నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ (ఎన్‌)కు దక్కింది.

ఆందోళనలు కొత్తవేమీ కావు..

2014లో నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ ఆందోళన జరిగింది. అప్పట్లో నవాజ్‌ ప్రభుత్వానికి సైన్యానికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో ఖాద్రీ మరోసారి రంగంలోకి దిగారు. నాడు ఇమ్రాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) సైతం నవాజ్‌ షరీఫ్‌కు వ్యతిరేకంగా ఇదే తరహాలో ‘సునామీ మార్చ్‌’ పేరిట ఉద్యమాన్ని నడిపింది. ఇప్పటి మాదిరిగానే అప్పుడూ రహదారులకు అడ్డంగా వాహనాలను పెట్టారు. వాటిపైకి ఎక్కి నాడు ఇమ్రాన్‌ ఉపన్యాసాలిచ్చారు. ఆ తరవాత నుంచి నవాజ్‌ ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చారు.

ఇమ్రన్​ వచ్చినప్పటి నుంచే..

2017లో పనామా పత్రాల కేసులో కోర్టు తీర్పుతో ప్రధాని పదవిని కోల్పోయారు నవాజ్​. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని ఇమ్రాన్‌ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైన్యం ఆయనకు అవసరమైన మద్దతును సమకూర్చింది. ప్రస్తుతం ఇమ్రాన్‌తో సైన్యం సంబంధాలు మునుపటి స్థాయిలో లేవు. ఆర్థిక పరిస్థితి మరింత మసకబారడం, ఎఫ్‌ఏటీఎఫ్‌ (ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌) ఆంక్షల నుంచి దేశం బయటపడకపోవడం ఆయనకు ప్రతికూలంగా మారింది. పూర్తిస్థాయిలో ఇమ్రాన్‌ రాజకీయ పరిపక్వతను ప్రదర్శించడం లేదన్న అభిప్రాయం వివిధ వర్గాల్లో ఉంది. గతేడాది అధికారం చేపట్టిన కొత్తల్లో సౌదీ అరేబియాలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో తమ దేశంలో అవినీతి పెరిగిపోయిందని ఆయన పేర్కొన్నారు.

జులైలో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు పాకిస్థాన్‌లో దాదాపు 40వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని చెప్పుకొచ్చారు. మరో సందర్భంలో తాలిబన్లకు అమెరికా సాయంతో తామే శిక్షణ ఇచ్చామని బాంబు పేల్చారు. సైనికాధిపతి జనరల్‌ బజ్వా కీలక విధాన నిర్ణయాలకు వేదిక అయిన జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ)లో సభ్యుడిగా చేరారు. గతనెలలో ఆయన స్వయంగా పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఇమ్రాన్‌ వెంట చైనా పర్యటనకూ వెళ్లారు.

సైనికాధ్యక్షుల రక్షణ చర్యలు

మరోపక్క 2022లో పదవీ విరమణ అనంతరం తనకు ఎటువంటి ఇబ్బంది రాకుండా జనరల్‌ బజ్వా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. సైన్యంలో కీలకమైన పదో కార్పస్‌కు అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ అజర్‌ అబ్బాస్‌ను నియమించారు. బజ్వా పనిచేసిన బలోచ్‌ రెజిమెంట్‌ నుంచే అబ్బాస్‌ వచ్చారు.
రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయం, భారత్‌-పాక్‌ల మధ్య గల నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ- లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌) రక్షణ బాధ్యతను ఇది నిర్వహిస్తుంది. అధ్యక్షుడి రక్షణ బాధ్యతలను దీని పరిధిలోని 111వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్‌ చూసుకొంటుంది. సైనిక తిరుగుబాటు చేయడానికి అవకాశం ఉన్న కీలక దళం ఇది. దీని అధిపతి సైనికాధ్యక్ష పదవి రేసులో అందరికన్నా ముందుంటారు.

మరిన్ని ఆందోళనలకు ఆవకాశం

ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న మౌలానా ఫజ్లుర్‌ రెహ్మాన్‌ అవకాశవాద నేత. కరడుగట్టిన ఛాందసవాది. అధికార మార్పిడి చేయాలంటే రెహ్మాన్‌ వంటి వారిని ముందు పెట్టి తెరవెనక సైన్యం కథ నడిపిస్తుందన్న పేరుంది.

ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌కు గతంలో రెహ్మాన్‌ తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెహ్మాన్‌ 1988 నుంచి 2018 జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా పనిచేశారు. బెనజీర్‌ అధికారంలోకి రావడంతో ఫజ్లుర్‌ ఆమెతో రాజీపడి డీజిల్‌ పర్మిట్లు తెచ్చుకొని దొంగ వ్యాపారం చేసి డబ్బు సంపాదించారు. అప్పటి నుంచి ఆయన్ను ప్రత్యర్థులు ‘మౌలానా డీజిల్‌’ పేరుతో ఎద్దేవా చేస్తుంటారు.

అవసరానికి అనుగుణంగా రంగులు మార్చడంలో రెహ్మాన్‌ సిద్ధహస్తులు. 1988 నుంచి ప్రతి ప్రభుత్వంతో రాజీపడి పదవులు పొందారు. ఇమ్రాన్‌ సర్కారులో ఏ పదవీ లభించలేదు. ప్రస్తుత ఉద్యమానికి ప్రధాన కారణం ఇదే. ఇమ్రాన్‌పై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో రెహ్మాన్‌ ఆందోళనకు సైన్యాధిపతి జనరల్‌ బజ్వా వ్యతిరేక వర్గాలు లోపాయికారీగా మద్దతు ఇస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలిసే ప్రతిపక్ష పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ), పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) పార్టీలు రెహ్మాన్‌కు కొంతమేరకు మద్దతు ఇస్తున్నాయి.

సరైన ప్రత్యామ్నాయం లేకనే..

పూర్తి మెజార్టీ లేని ఇమ్రాన్‌ను గద్దెదించడం సైన్యానికి చిటికెలో పని. కానీ, ఆయనకు సరైన ప్రత్యామ్నాయం లభించడం లేదు. ఈ పరిస్థితుల్లో సైన్యం తిరుగుబాటు చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే నవాజ్‌ షరీఫ్‌పై సానుభూతితో ఆయన పార్టీ పీఎంఎల్‌ (ఎన్‌) గెలిచే అవకాశాలను పూర్తిగా తోసిపుచ్చలేం. ఇది సైన్యానికి ఇబ్బందికరం.

అందువల్ల రెహ్మాన్‌ను బుజ్జగించి ఆయనకు ఏదో ఒక లబ్ధి చేకూరిస్తే ప్రస్తుత ఉద్రిక్తత చాలా వరకు తగ్గిపోతుంది. అలాగని రెహ్మాన్‌ను ప్రధాని పీఠంపై కూర్చోపెట్టే సాహసాన్ని సైన్యం చేయలేదు. ఇమ్రాన్‌ను మార్చాల్సి వస్తే పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ వంటి వారి పేర్లు పరిశీలనకు వస్తాయి.
బిలావల్‌ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) వైపు సైన్యం దృష్టి సారించే అవకాశమూ లేకపోలేదు. ఇమ్రాన్‌ను కొనసాగించాలనుకుంటే మరిన్ని ఆందోళనలు చోటుచేసుకునే అవకాశాన్ని తోసిపుచ్చలేం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This