పదో తరగతి హాస్టల్‌ విద్యార్థులకు ప్రత్యేక అవకాశం

ఇతర జిల్లాల్లోని రెసిడెన్షియల్‌ హాస్టళ్లు, ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పదో తరగతి చదువుతూ లాక్‌డౌన్‌ వల్ల సొంత జిల్లాలకు వెళ్లిపోయినవారు అదే జిల్లాల్లో పరీక్ష రాసేందుకు ప్రభుత్వం వీలు కల్పించనుంది. అలాంటి విద్యార్థుల వివరాలను సేకరించి శనివారం పంపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డీఈవోలను ఆదేశించింది. ఇలాంటి ఇబ్బంది ఉన్న విద్యార్థులు తమకు చెప్పాలని శుక్రవారమే డీఈఓలు ఫోన్‌ నంబర్లను ప్రకటించారు. అయితే దీనివల్ల కొన్నిచోట్ల సమస్యలు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు ఏటూరునాగారానికి చెందిన విద్యార్థి హైదరాబాద్‌లో ఆంగ్ల మాధ్యమం చదువుతుంటే ఇప్పుడు ఆ విద్యార్థి ఉన్న ప్రాంతంలో ఆంగ్ల మాధ్యమం ప్రశ్నపత్రాలు లేకుంటే ఎలా అనే సందేహం తలెత్తుతోంది. ముందుగానే వివరాలు తీసుకుంటున్నందున ఆ జిల్లా పరిధిలో ఎక్కడైనా రాసేలా చూడవచ్చని అధికారి ఒకరు తెలిపారు.

హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సులు

సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్థుల కోసం హైదరాబాద్‌ నగరంలో ప్రత్యేక బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖ కోరినన్ని బస్సులు నడపాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. బస్సులను పూర్తిస్థాయిలో శానిటైజ్‌ చేయటంతోపాటు విద్యార్థులకు కూడా శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ నిర్ణయించింది.

‘రెగ్యులర్‌’కు సుముఖమే!

సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైనవారిని రెగ్యులర్‌ విద్యార్థులుగా పరిగణించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటని హైకోర్టు ప్రశ్నించినందున దీనిపై అధికారులు చర్చిస్తున్నారు. రెండురోజుల క్రితమే విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ ఈ సమస్యను ప్రస్తావించి ఇంటర్‌బోర్డు అనుమతించినందున పదో తరగతికి కూడా అదే విధానం అమలు చేయవచ్చని అధికారులతో చెప్పినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This