ముఖ్యమంత్రి క్రైస్తవుడు అనేందుకు ఆధారాలేవి?: హైకోర్టు

ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి క్రిస్టియన్ అనేందుకు ఆధారాలు చూపాలని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఆధారాలు సమర్పించకుండా సీఎం హిందువు కాదు క్రైస్తవుడని ఎలా కోర్టుకు చెబుతారని వ్యాఖ్యానించింది. వివరాలు లేకుండా వ్యాజ్య విచారణలో ముందుకెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అదనపు వివరాలు సమర్పించేందుకు వీలుగా విచారణను ఈ నెల22కి వాయిదా వేసింది. వ్యాజ్యంలో గవర్నర్​ను ప్రతివాదుల జాబితాలో చేర్చడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. గవర్నర్​కు వ్యతిరేకంగా ఎలాంటి అభ్యర్థన కోరనప్పుడు ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ… ఆయన్ను జాబితా నుంచి తొలగించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలకు తిరుమలకు వెళ్లిన ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వలేదని, అధికారులు సైతం చట్ట నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుఠపురం గ్రామానికి చెందిన ఎ.సుధాకర్ బాబు హైకోర్టును ఆశ్రయించారు . ఏ ఆధికారంతో ముఖ్యమంత్రి జగన్, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆ పోస్టుల్లో కొనసాగుతున్నారో వివరణ కోరాలని ‘కోవారెంటో’ పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ… ‘తిరుమలలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది. దేవాదాయశాఖ చట్ట నిబంధన 136, 137 ప్రకారం హిందూయేతరులు స్వామి వారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. క్రైస్తవుడయిన సీఎం.. డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్లారు. ఇది దేవాదాయ చట్టంలోని సెక్షన్ 97, 153లకు విరుద్ధం. తితిదే అధికారులు చట్ట నిబంధలను అమలు చేయడంలో విఫలమయ్యారు. సీఎం డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రకటనలు చేశారు. దీనిపై టీవీల్లో చర్చలు జరిగాయి’ అన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ… టీవీల్లో చర్చల గురించి చెప్పొద్దన్నారు.ఆయన క్రైస్తవుడు అని చెప్పేందుకు మీ వద్ద ఆధారాలేమున్నాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పష్టతిచ్చేలా కోరాలని న్యాయవాది తెలిపారు. తామెందుకు ముఖ్యమంత్రిని అడగాలి… వ్యాజ్యం దాఖలు చేసిన వారే ఆధారాలు చూపాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు పలు క్రైస్తవ సభల్లో పాల్గొన్నారని… సీఎం ఈ విషయంలో మౌనంగా ఉండటంతో ఆయన్ను క్రిస్టియన్​గా భావించాల్సి వస్తోందని న్యాయవాది పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ శ్రీరామ్ అని పేరు పెట్టుకుంటే హిందువని, దేవానంద్ పేరు పెట్టకుంటే క్రైస్తవుడని ఎలా అనుకుంటామన్నారు. సీఎం క్రైస్తవుడనే ఆధారాలు సమర్పించేందుకు గడువిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్​. శ్రీరామ్, తితిదే తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వ్యాజ్య విచారణార్హతపై అభ్యంతరం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This