మీకు ఎక్కువకాలం బతకాలని ఉందా?

ఆయుష్షును పెంచుకోవటానికి ఎన్నో మార్గాలు. మంచి తిండి తినటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, కంటి నిండా నిద్రపోవటం వంటివన్నీ జీవనకాలాన్ని పొడిగించేవే. కొన్ని ముందస్తు ఆరోగ్య పరీక్షలు కూడా బాగా ఉపయోగపడతాయి.

ఇవి మాత్రమే కాదు. ఒక లక్ష్యం కోసం జీవించటమూ ఆయుష్షు పెరగటానికి తోడ్పడుతుంది! ఇలాంటివారికి ఏ కారణంతోనైనా మరణించే ముప్పు తగ్గుతున్నట్టు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. గుండెజబ్బులూ తక్కువగానే ఉంటున్నాయి కూడా. సాధారణంగా మనం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిజోల్‌ హార్మోన్‌ విడుదలవుతుంటుంది. ఇది పెద్దమొత్తంలో విడుదలైతే గుండె, మెదడు, కండరాల వంటి వాటిని దెబ్బతీస్తుంది. దీంతో రకరకాల జబ్బులూ ముంచుకొస్తాయి. ఫలితంగా ఆయుష్షు కూడా తగ్గుతుంది.

అయితే ఒక లక్ష్యం కోసం జీవించేవారు తమ గమ్యమేంటో ముందుగానే స్పష్టంగా నిర్ణయించుకుంటారు. దాన్ని చేరుకునే మార్గాలనూ ముందే సిద్ధం చేసుకుంటారు. ఏవైనా ఆటంకాలు ఎదురైనా తేలికగా ఎదుర్కోగలుగుతారు. అందువల్ల వీరిలో ఒత్తిడి పాళ్లు తక్కువగా ఉంటుండొచ్చన్నది పరిశోధకుల భావన. అంతేకాదు.. లక్ష్యాన్ని సాధించాలనుకునేవారు తమ ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకుంటారు కూడా. చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు. ఇవన్నీ ఆయుష్షు పెరగటానికి దోహదం చేసేవే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This