మనసు బాలేదా? అయితే ఇలా చేయండి…

యోగా మనల్ని శారీరకంగానే కాదు.. మానసికంగానూ దృఢపరుస్తుంది. మరి ఆందోళనను తరిమే ఆసనాలు.. ప్రశాంతతను చేకూర్చే చిట్కాలపై ఓ లుక్కేయండి..

ఇలా చేస్తే ఆందోళనలు దూరం!

ఒత్తిడి, భయం, ఆందోళన.. ఏదో ఒక విషయంలో మనం కూడా ఈ ఫీలింగ్స్‌ని ఎదుర్కొంటుంటాం. ఇది ఎప్పుడో ఓసారి అయితే పర్లేదు.. కానీ కొంతమంది ప్రతిదానికీ భయపడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు.. రోజూ ఒత్తిళ్ల మధ్యే గడుపుతుంటారు. ఇలాంటి పరిస్థితే గనుక కొన్నాళ్ల పాటు కొనసాగినట్లయితే.. అది క్రమంగా యాంగ్జైటీ డిజార్డర్‌కు దారితీసే ప్రమాదముందంటున్నారు మానసిక నిపుణులు. అయితే ఈ మానసిక సమస్యను జయించడానికి యోగాను మన జీవన విధానంలో భాగం చేసుకోవడంతో పాటు మరిన్ని నియమాలు పాటించాలని వారు సూచిస్తున్నారు. ఇంతకీ అవేంటంటే..!

ఈ ఆసనాలతో ఆనందంగా..!

మన మనసులోని ఆందోళనలు, ప్రతికూల ఆలోచనల్ని దూరం చేసి ఆనందాన్ని, మానసిక ఆరోగ్యాన్ని అందించే శక్తి యోగా సొంతం. అందుకు కొన్ని యోగాసనాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా మత్స్యాసనం, సేతు బంధాసనం, మార్జాలాసనం, శీర్షాసనం.. వంటి యోగాసనాలు మంచి ఫలితాలు అందిస్తాయి. ఇలా ఏ యోగాసనం చేసినా.. ఆ సెషన్‌ పూర్తయ్యాక కొన్ని నిమిషాల పాటు యోగ నిద్రలోకి వెళ్లడం వల్ల శరీరం, మనసు రిలాక్సవుతుంది. అంతేకాదు.. ఈ యోగాసనాల వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటికి వెళ్లిపోయి అటు ఆరోగ్యం, ఇటు మానసిక ప్రశాంతత లభిస్తాయి. అయితే తొలిసారి యోగాసనాలు సాధన చేస్తున్న వారు మాత్రం మరీ కఠినమైనవి కాకుండా కాస్త సులభమైన ఆసనాలు ఎంచుకోవడం మంచిది. ఈ క్రమంలో బోలెడన్ని యూట్యూబ్‌ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చూస్తూ నెమ్మదిగా, జాగ్రత్తగా ఆసనాలు ప్రాక్టీస్‌ చేయచ్చు.

ఇతరుల గురించి కూడా ఆలోచించండి!

‘నేను, నా వాళ్లు, నా వస్తువులు’.. అంటూ మనలో చాలామంది ఎప్పుడు చూసినా వీటి చుట్టూనే తిరుగుతుంటారు. అయితే మనలోని ఆందోళనల్ని దూరం చేసుకోవాలంటే ఇలాంటి స్వార్థపూరిత జీవితం నుంచి కాస్త బయటకొచ్చి ఇతరుల గురించి కూడా ఆలోచించమంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎప్పుడు చూసినా మన గురించే, మనకు సంబంధించిన విషయాల గురించే ఆలోచించడం వల్ల మన ఆందోళనలకు మూలమైన విషయాలే మనకు పదే పదే గుర్తొచ్చి మానసికంగా మరింత కుంగదీస్తాయి. అదే.. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం, మనకు తోచినట్లుగా సహాయపడడం వల్ల మనం పొందే ఆనందం, సంతృప్తి అనుభవిస్తేనే అర్థమవుతుంది. తద్వారా ఒత్తిడి కలిగించే విషయాల గురించి ఆలోచించకుండా సంతోషంగా గడపచ్చు.. అంతేకాదు.. ఇలాంటి పనులు మనసును ఉత్సాహపరచడంతో పాటు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This