‘సొంత బలగాలను కాపాడుకునేందుకు డీజీపీనే ఆసక్తి చూపలేదు’

ఠాణాపై దాడికేసు విచారణను ఉపసంహరించుకోవటానికి స్వయానా డీజీపీయే ప్రతిపాదన చేయడంపై హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సొంత బలగాలను రక్షించేందుకు డీజీపీ ఆసక్తి చూపనట్లయితే, పోలీసులపై దాడి చేసేందుకు పబ్లిక్‌ను ప్రోత్సహిస్తున్నట్లయితే.. పాత గుంటూరు ఠాణాపై దాడి చేసిన వారిపై ప్రాసిక్యూషన్‌ ఉపసంహరించడానికి వీల్లేదని మీరెలా పిల్‌ దాఖలు చేస్తారంటూ పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఠాణాపై దాడి చేసిన వారిపై ప్రాసిక్యూషన్‌ ఉపసంహరణకు కారణం ఏదైనా డీజీపీ తనకు తానుగా ముందుకొచ్చారని గుర్తుచేసింది. ఠాణాపై దాడి కేసులో ప్రాసిక్యూషన్‌ ఉపసంహరిస్తే హైకోర్టును ఆశ్రయించడానికి హక్కున్న అసలైన బాధిత సంస్థ ‘పోలీసు అసోసియేషన్‌’ అని తెలిపింది.ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా(రిజర్వు) వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

2018 మే 15న పాతగుంటూరు ఠాణాపై దాడిచేసి, విధుల్లో ఉన్న పోలీసుల్ని గాయపరిచిన ఘటనలో ముస్లిం యువకులపై ఆరు కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణను.. డీజీపీ ఆదేశాల మేరకు ఉపసంహరించుకునేందుకు హోంశాఖ జారీచేసిన జీవో 776ను రద్దు పరచాలని కోరుతూ పసుపులేటి గణేశ్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని అభ్యర్థించారు. ప్రాసిక్యూషన్‌ ఉపసంహరణకు డీజీపీ నే ప్రతిపాదించినందున సొంత బలగాలను రక్షించేందుకు డీజీపీయే ఆసక్తి చూపకపోతే.. ప్రాసిక్యూషన్‌ ఉపసంహరించడానికి వీల్లేదని మీరెలా పిల్‌ దాఖలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.

జాగ్రత్త వహించేలా సూచించండి…

పిల్‌కు విచారణ అర్హత లేదని విశాఖ సీబీఐ ఎస్పీ అఫిడవిట్‌ వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సీబీఐకి 12 ఏళ్లు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశానని, హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్నానని, ఇన్నేళ్లలో ఎన్నడూ ఇలాంటి అఫిడవిట్‌ చూడలేదని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ అన్నారు. భవిష్యత్తులో అఫిడవిట్‌ వేసేముందు జాగ్రత్త తీసుకునేలా ఎస్పీకి సూచించాలని సీబీఐ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)కి స్పష్టంచేశారు. మీరు ఇచ్చే ఉత్తర్వులకు కట్టుబడి ఉంటామని సీపీ చెన్నకేశవులు పేర్కొనగా.. తాము ఇచ్చే ఉత్తర్వులను అనుసరించాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రైవేటు వివాదంలో వేసిన అఫిడవిట్‌ తరహాలో సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేస్తుందా? అని నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This