బాపూదే గురుపీఠం- ఆయనో వికాస పాఠం!

మహాత్మాగాంధీని స్వాతంత్య్ర సమర సేనానిగా, సమర్థుడైన న్యాయవాదిగా, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా, నిరాడంబరుడుగా, త్యాగశీలిగా, గొప్ప విద్యావేత్తగా, సత్యాగ్రహిగా, అహింసావాదిగా సాధారణంగా అందరూ గుర్తిస్తుంటారు. కానీ, ఆయనలోని అద్భుతమైన గురువును స్మరించుకున్న దాఖలాలు చాలా తక్కువ. ఆ కోణంలో ఆయనను దర్శిస్తే బోధన వృత్తిపై ఆయన అభిరుచి అవగతమవుతుంది. ఆయన స్వీయచరిత్రలో ఆ వివరాలున్నాయి. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఎంతో తపనతో జీవన పాఠాలు బోధించినట్లుగా మహాత్ముడు తన స్వీయచరిత్రలో ఎన్నో విలువైన సూచనలు చేశారు. ఆ రకంగా బోధనను ఆయన వృత్తిగా స్వీకరించలేకపోయినా ప్రవృత్తిగా ఆచరించారు.

గురువుకు శిష్యులంతా సమానమే

దక్షిణాఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్‌లో టాల్‌స్టాయ్‌ ఫార్మ్‌ పేరిట 1910లో గాంధీజీ మొట్టమొదటి ఆశ్రమం స్థాపించారు. గాంధీజీ బోధన, విద్యలో జరిపిన ప్రయోగాలన్నింటికి ఆ ఆశ్రమం ఒక ప్రయోగశాల. అక్కడ వృత్తి విద్యకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులు రోజూ ఎనిమిది గంటలపాటు వృత్తి విద్యలో శిక్షణ పొందితే; రెండు గంటలపాటు బోధన, పుస్తక పఠనం చేసేవారు. విద్యార్థులను స్వీయశక్తిమంతులుగా తీర్చిదిద్ది వారిని స్వావలంబన బాట పట్టించడమే లక్ష్యంగా ఆశ్రమం కొనసాగింది. మత, ప్రాంత, వర్ణ, లింగ భేదాలకు అతీతంగా ఆశ్రమం నడిచింది. ఒకసారి గాంధీజీ సహచరుడు, ఆశ్రమ నిర్వహణలో ప్రధాన భాగస్వామి, ఆశ్రమానికి టాల్‌స్టాయ్‌ పేరును ప్రతిపాదించిన హెర్మన్‌ కాలెన్‌బాక్‌ గాంధీజీతో మిగిలిన పిల్లలతో సమానంగా మహాత్ముడి పిల్లలూ కలపడంవల్ల వారు పాడయ్యే అవకాశం ఉండవచ్చునని లేదా ఆశించినంత వృద్ధి సాధించలేకపోవచ్చునని కాబట్టి వారికోసం ఆశ్రమంలో కొంతవరకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమోనని సలహా ఇచ్చారు. అందుకు గాంధీజీ ‘నా పిల్లల్ని, ఇతర పిల్లల్ని వేర్వేరుగా నేను చూడలేను. ఇరువురికీ నేను సమాన బాధ్యత వహిస్తున్నాను. నా దృష్టిలో ఇద్దరూ ఒక్కటే. ఈ ఆశ్రమంలో కొందరు జులాయిలు, సోమరులు ఉన్నారనే విషయం నాకు తెలుసు. అలా అని వారిని దూరంగా ఉంచి వేరే విధంగా చూడలేను. పతనమైపోతున్న వారిని సైతం మార్చవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. నా పిల్లలకు ఏది మంచో, ఏది చెడో తెలుసుకోవడానికి, ఏది ఆచరణీయమో, ఏది కాదో అవగాహన చేసుకొని సమాజంలో బతకడానికి ఈ ఆశ్రమంలో మనం పాటించే సమానతా సూత్రం ఉపకరిస్తుంది’ అని బదులిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This