గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం

“దైవం ఎక్కడో లేడు… సత్యంలో కొలువై ఉన్నాడు. అసలు సత్యమే దైవం. ప్రతి మనిషీ సత్యానికి బద్ధుడు” ఇదీ.. .మహాత్ముడి ఉద్బోధ. మొదట…దేవుడు.. అంటే సత్యం..! అని గాంధీ చెప్పారు. ”ఎవరికి వారు సొంత దేవుణ్ని సృష్టించుకోవడం వల్ల గందరగోళం ఏర్పడింది. మనుషుల్ని చంపడం, అగౌరవ పరచడం, ఆత్మన్యూనత భావానికి గురి చేయడం లాంటివి దేవుడి పేరుతో చేస్తున్నారు” అని గాంధీజీ భావించారు. అందుకే…ఆయన నిజం నిర్వచనం మార్చి… దేవుడే సత్యం అన్నది సరికాదు.. సత్యమే దేవుడు అని కొత్త భాష్యం చెప్పారు.

జీవితాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుని తన విశ్వాసాలు, సిద్ధాంతాలు అందులో పరిశోధించిన గాంధీజీ…భారతీయ చింతనకు కొత్త రంగులద్దారు. తన ప్రయోగాల్లో భాగంగా అంతకు ముందు సత్యమని అంగీకరించిన వాటినీ ఆయన కొట్టిపారేశారు. తొలిరోజుల్లో దైవాన్ని ఆయన సత్యంగా భావించేవారు. 1920వ దశకం చివర్లో సత్యమే దైవమని తన విధానం మార్చుకున్నారు. సత్యాన్ని దేవుడి కంటే ఉన్నతంగా భావించారు. అంతిమ సత్యం కనుగొన్నానని గాంధీజీ ఎప్పుడూ ప్రకటించలేదు. “నేను పట్టుకున్నది శక్తిమంతమైన అందమైన మెరుపు మాత్రమే” అని చెప్పేవారు.

సత్యాగ్రహమే ఆయుధంగా…

గాంధీ జీవితం, ఆయన విశ్వసించిన సిద్ధాంతాలు, నడిపిన ఉద్యమాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. వీటికి ప్రాతిపదికలు సత్యం, అహింస. రెంటినీ కలిపి సత్యాగ్రహమనే ఆయుధం తయారు చేసి గాంధీ తన పోరాటంలో వాడుకున్నారు. గాంధీజీ ఆస్తికుడు. దేవుడి అస్తిత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇక్కడ దేవుడు అంటే విశ్వమంతా వ్యాపించిన మహాశక్తి. ఇంతకీ సత్యం అంటే ఏంటి? అన్న ప్రశ్నకు…సర్వమానవాళికీ ఆమోదయోగ్యమైనదే సత్యం..! అలాగే సత్యాన్ని సర్వమానవాళీ తప్పనిసరిగా ఆమోదిస్తుంది అంటారాయన.

సత్య హరిశ్చంద్ర నాటకం చిన్నతనంలో చూసిన గాంధీజీ సత్యానికి ఆకర్షితులై,అంకితమై జీవించారు. సత్య నిష్ఠ ఉన్నందునే హరిశ్చంద్రుడు…చరిత్ర ప్రసిద్ధులయ్యారని గ్రహించారు. ఎన్నికష్టాలెదురైనా సత్యమార్గం విడవను అని తీర్మానించుకొన్నారు. తండ్రి జేబులో డబ్బు దొంగిలించి తండ్రికి నిజం చెప్పి ఆయన మనసు గెలుచుకున్నారు. చేసిన తప్పులు తెలుసుకొని తనపై తాను ప్రయోగాలు చేసుకొని సత్యమార్గం అనుసరించారు బాపూజీ. ఇలా చిన్నతనంలోనే సత్య విజయం సాధించారు.

ఏ పరిస్థితుల్లోనైనా సత్యమే….

పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి మొదటి మెట్టు కల్లాకపటం లేకుండా ఉండడం. అలా ఉన్నవాడే సత్యం తెలుసుకోగలుగుతాడని మహాత్ముడు ప్రవచించారు. నిజం మనిషికి ధైర్యమిస్తుంది. పోరాడే శక్తినిస్తుందని చెబుతారు గాంధీ. సత్యసంధత పాటించే విషయంలో ఎలాంటి ఒడుదొడుకులైనా తొణకకూడదని చెప్పారు బాపూజీ. ఏ పరిస్థితుల్లోనైనా సరే సత్యం పలకాలని తనకు తానుగా నిర్దేశించుకున్నారు. బాపూజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటి నుంచి ఆయన సత్యశోధనకు అవసరమయ్యే మార్గం అన్వేషిస్తూనే ఉన్నారు. మన ఆలోచనలు భావితరాల జీవితానికి ఉపయోగపడే ప్రాథమికమైన నీతి సూత్రాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు. ఆయన తత్వంలో జీవితం అనేది సమగ్రమైనది. వ్యక్తిగత స్వేచ్ఛలో ఒక సత్యం, సామాజికంగా మరో భిన్నమైన సత్యం ఉండకూడదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This