సుదృఢ భారతమే ‘ఫిట్​ ఇండియా’ లక్ష్యం

మనిషి పురోగతికి ప్రాతిపదిక సిరిసంపదలా లేక ఆరోగ్యవంతమైన జీవనమా? వ్యక్తి, వ్యవస్థ కుటుంబం, దేశాల తీరైన ఎదుగుదలకు జీడీపీ వృద్ధికన్నా ఆరోగ్యమే కీలకమన్నది నిస్సందేహం. రోగాలూ రొష్టులతో సతమతమయ్యే దేశం ఎంత సంపద ఉన్నా దీర్ఘకాలం మనుగడ సాగించలేదు. కానీ చురుకైన, చక్కటి శారీరక దారుఢ్యంగల మానవ వనరులున్న జాతి- సంపద వెనకేసుకోవడంలో ఒకింత వెనకబడినా ఏనాటికైనా కళ్లుచెదిరే విజయాలనే సొంతం చేసుకొంటుంది. జీడీపీని పరుగులు పెట్టించి భారతావనిని సంపన్నంగా ఎలా తీర్చిదిద్దాలనడంకన్నా- జాతిని ఆరోగ్య పథం పట్టించడమెలాగన్న దానిమీదే ఎక్కువగా చర్చ జరగాల్సి ఉంది.

కరోనా మహమ్మారి ప్రపంచ ఆలోచన సరళిని ఒక్కపెట్టున మార్చివేసింది. సుస్థిరాభివృద్ధి పథంలో కదం తొక్కుతున్నా- ఆరోగ్యం, విద్య అంతంతమాత్రంగా ఉన్న దేశాలు మహమ్మారి బారినపడి అతలాకుతలమయ్యాయి. మనిషి సగటు జీవన కాలావధికి; విద్య ఆరోగ్యాలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. భద్రమైన రేపటికోసం దేశాలన్నీ ఆరోగ్యం, విద్యలపై వ్యయం పెంచాలి. సరికొత్త ఆలోచనలతో, సృజనాత్మక పంథాలో జాతిని నూతన పథం తొక్కించేందుకు కంకణబద్ధమైన మానవ వనరులకు మన దేశంలో కొదవలేదు. సృజనశీలురందరూ ఒక్కటై దేశాన్ని కొత్త బాట తొక్కించేందుకు అహరహం శ్రమిస్తుంటే- వారికి ఇబ్బందిలేని వాతావరణాన్ని సృష్టించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. మహమ్మారులు విరుచుకుపడినప్పుడో, ఆరోగ్య ఆత్యయిక స్థితి తలెత్తినప్పుడో మాత్రమే మన విధానకర్తలు మత్తువదులుతుండటమే దురదృష్టకరం! జాతిని అనారోగ్యం చుట్టుముడితే ఉత్పాదకత కొడిగడుతుంది, దేశ ఆర్థికవ్యవస్థ దిక్కూమొక్కూలేనిదై కుప్పకూలుతుంది. దేశ ఆరోగ్యం ఇప్పుడు ఒడుదొడుకుల్లో ఉంది. ముప్పు ముంచుకొచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లోనైనా విధానకర్తలు కళ్లు తెరవాలి, నిర్మాణాత్మక విధానాలపై దృష్టి సారించాలి. వ్యక్తి ఆరోగ్యమే కేంద్రంగా ప్రణాళికలు రచించాలి. ఆరోగ్యమంటే కేవలం శారీరక దారుఢ్యమే కాదు. మానసిక పటుత్వం, ఉద్వేగ సమస్థితి కూడా ఆరోగ్యంలో అంతర్భాగమే. రోగాలు ముసురుకుంటే వ్యవస్థల పురోగతి మందగిస్తుంది. స్థూల దేశీయోత్పత్తి ఎదుగుదలకు అది అతిపెద్ద ప్రతిబంధకమవుతుంది.

దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. ఆర్థికం కన్నా జాతి ఆరోగ్య పునాదులను పటిష్ఠం చేసుకోవడమే ప్రాథమ్యంగా చర్చ సాగాల్సిన నేపథ్యమిది. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగకపోతే ఆరోగ్యపరంగా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం అంత సులభం కాదు. ప్రాచీన భారతం ప్రపంచానికే ఆరోగ్య పాఠాలు నేర్పిందని గొప్పగా చెప్పుకొంటుంటాం! ఆ స్ఫూర్తిని ప్రతిఫలిస్తూ స్వాస్థ్య భారత నిర్మాణమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రపంచ దేశాలకు దిశానిర్దేశమనదగ్గ స్థాయిలో ఆరోగ్య విధానాలకు రూపకల్పన చేసుకొని ‘నయా భారత్‌’ను ఆవిష్కరించుకోవాలి. వెయ్యిమందికి కనీసం మూడు ఆసుపత్రి పడకలు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణీకరించింది. ఆ లెక్కన వెయ్యిమందికి ఒక్క ఆసుపత్రి పడక అందుబాటుతో భారత్‌ అట్టడుగున మగ్గుతోంది. వైద్య నిపుణుల అందుబాటుకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే భారత్‌ పరిస్థితి దిగనాసి! ఆరోగ్య సౌకర్యాలను పెంచుకోవడంతోపాటు, వ్యాధులు ముట్టడించకుండా చుట్టూ పరిశుభ్ర వాతావరణాన్ని సృష్టించుకోవాల్సిన ప్రాధాన్యాన్నీ ప్రభుత్వాలు గుర్తించాలి. ఆ మేరకు ప్రజల్లో చైతన్యం రేకెత్తించాలి.

ఆర్థిక సంక్షోభం అలుముకున్న ప్రస్తుత తరుణంలో ఆరోగ్యరంగానికి ఇబ్బడిముబ్బడిగా నిధులు పెంచడమన్నది ఆచరణాత్మకంగా చూస్తే సాధ్యమయ్యే పనికాదు. బరువు బాధ్యతలన్నింటినీ పూర్తిగా ప్రభుత్వాలే భరించాలనడమూ కుదిరే పనికాదు. కాబట్టి ప్రజాభాగస్వామ్యం పెరగాలి. ఆరోగ్య భారతావని ఆవిష్కరణ ప్రజల బాధ్యత కూడా అన్న విషయాన్ని గుర్తు చేయాలి. ఆరోగ్య రంగాన్ని పటిష్ఠంగా తీర్చిదిద్దడంకోసం విధానకర్తలు ఇప్పటికే అనేక విధానాలు అమలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆరోగ్య బీమాకు సంబంధించి సృజనాత్మక ప్రతిపాదనలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. దేశంలో చాలా తక్కువమందికే జీవిత బీమా ఉంది. వీరితో పోలిస్తే ‘ఆరోగ్య బీమా’ చేయించుకున్న వారి శాతం మరీ కనిష్ఠం. బీమా మొత్తం చెల్లించే స్థోమత లేకపోవడమే దేశంలో ఎక్కువమంది ఆరోగ్యబీమా చేయించుకోకపోవడానికి కారణం. ఈ సమస్యను అధిగమించాలంటే ప్రభుత్వాలు బీమా ‘ప్రీమియం’లో కొంత భాగాన్ని భరించేందుకు ముందుకు రావాలి. ప్రజలు చురుకుగా కదిలి, ఆరోగ్యం పట్ల, పారిశుద్ధ్యం పట్ల కచ్చితమైన శ్రద్ధ చూపినప్పుడే ‘ప్రీమియం’ చెల్లింపులో కొంత భాగం చెల్లిస్తామన్న షరతు విధించాలి. దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఈ ఆలోచనను అమలు చేయడం సాధ్యం కాకపోయినా- ముందస్తుగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావాలి. క్రమంగా ఈ పద్ధతిని దేశమంతటా విస్తరించాలి. ఆరోగ్యంపట్ల స్పృహ కలిగిన మానవ వనరులు దేశవ్యాప్తమయితేనే పటుతర భారతావని ఆవిష్కృతమవుతుంది.

– డాక్టర్‌ అనిల్‌ కృష్ణ గుండాల (హృద్రోగ నిపుణులు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This