జగిత్యాలలో చెరువుల నిండుగా.. జలపుష్పాలు పొంగగా!

జగిత్యాల జిల్లాలో వెల్గటూరు, ధర్మపురి మండలాలను ఆనుకుని ఎల్లంపల్లి ప్రాజెక్టుండగా మరో అయిదు మండలాలను ఆనుకుని గోదావరి నది ప్రవహించడం, 69 కి.మీ పొడవున్న వరదకాలువలో నిండుగా నీటిని నిల్వచేయడం, శ్రీరాంసాగర్‌ జలాశయం నీటితో చెరువులను నింపడం చేపల పెంపకానికి ఎంతగానో దోహదపడుతోంది. జిల్లాలో 1,226 చిన్నతరహా చెరువులు, కుంటలుండగా గత నాలుగైదు సంవత్సరాలుగా సగంకన్నా ఎక్కువగా చెరువుల్లో చేపపిల్లలను వదులుతున్నారు. వీటి సంతతి ఏటికేడు పెరుగుతుండగా నిరుడు సాధారణం కన్నా 20 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం, వాతావరణం అనుకూలించడంతో చేపలు భారీగా వృద్ధిచెందాయి.

ఉపాధికి ఊతం

జిల్లాలో 156 వరకు మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలుండగా ఇందులో 7,550 మందికిపైగా సభ్యులున్నారు. జిల్లాలో ఇసుక భూములు, ఎర్ర నేలలు, ఒండ్రు, నల్లనేలలు, గోదావరి నీటితో నిండే చెరువులు కుంటలుండటంతో వీటిల్లో పెరిగే చేపలు అత్యంత రుచికరంగా ఉండి పశ్చిమ బంగాలోని కోల్‌కతా, సిలిగురి, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. రహు, కట్ల, జల్ల, బొమ్మె, మ్రిగాల, కొరమీను తదితర రకాల చేపలు ఇక్కడ ఎక్కువగా పెరుగుతాయి. నిరుడు జలలభ్యతతో లక్ష్యానికి మంచి చేపలు ఉత్పత్తి కాగా మత్స్యకారులకు రూ. 28 కోట్లవరకు వివిధ పరికరాలు, యంత్రాలు, మొబైల్‌ మార్కెట్లకు రాయితీ ఇవ్వడంతో పెద్దఎత్తున ఉపాధి కలిగింది. జిల్లాలోని అన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాల్లోనూ వినియోగదారులకు కూడా నిరంతరం చేపలు అందుబాటులోకి వచ్చాయి.

ఈ సంవత్సరం అనుకున్నదానికన్నా అధికంగా చేపలు పెరిగినా వేసవిలో కరోనాతో ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లలేని పరిస్థితి ఉండటంతో కొన్ని చెరువుల్లో చేపలను పట్టలేదు. చెరువుల్లో పట్టకుండా ఉన్నవి వచ్చే సంవత్సరం వరకు మరింతగా పెరుగుతాయి. ఐతే స్థానికంగా జిల్లావ్యాప్తంగా అన్నిప్రాంతాల్లోనూ చేపల అమ్మకాలు గణనీయంగా పెరగటం మత్స్యకారులకు ఊరట కలిగించే అంశంగా ఉంది. ప్రభుత్వం చేపల ఎగుమతికి అవకాశాలు కల్పించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This