చర్చల పునరుద్ధరణపై నేడు రైతు సంఘాల కీలక భేటీ

నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా లేఖ పంపిన క్రమంలో.. దిల్లీలో ఆందోళన చేపడుతున్న రైతు సంఘాల నేతలు శుక్రవారం భేటీ అయ్యారు. శనివారం మరోసారి సమావేశమై చర్చలను పునరుద్ధరించే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో రైతులతో తదుపరి చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.

కొత్త సాగు చట్టాలపై తదుపరి చర్చలకు హాజరు కావాలంటూ వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ గురువారం రైతు సంఘాలకు లేఖ రాశారు. అయితే ‘కనీస మద్దతు ధర’ ఈ చట్టాల పరిధిలో లేదని, చర్చల సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఓ రైతు నేత స్పందిస్తూ “కొత్త చట్టాల్లో ప్రైవేటు మండీల గురించి ప్రస్తావించారు. అలాంటప్పుడు మా పంటలకు వారు కనీస మద్దతు ధర చెల్లించేలా ఎవరు పర్యవేక్షిస్తారు? గిట్టుబాటు ధర చెల్లించకపోతే ఎవరు బాధ్యత వహిస్తారు?” అని ప్రశ్నించారు. “మేము వ్యక్తం చేస్తున్న ఆందోళనల పట్ల ప్రభుత్వానికి అవగాహన లేనట్టుంది. ప్రభుత్వం తాజా ఆహ్వానం మేరకు చర్చలను పునరుద్ధరించడంపై నిర్ణయం తీసుకుంటాం. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత విషయంలో ఎలాంటి మార్పూ ఉండబోదు” అని మరో నాయకుడు స్పష్టం చేశారు.

రైతుల్ని విభజించేందుకు ప్రయత్నం..

సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల్ని విభజించేందుకు.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారంటూ.. రైతు సంఘాలు ఆరోపించాయి. కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల వేళ.. ప్రధాని మోది చేసిన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని రైతులు ఆక్షేపించారు. మోదీ చెబుతున్నట్లు తమ వెనుక ఏ రాజకీయపార్టీ కూడా లేదని రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. తమకు కావల్సిందల్లా.. పండించిన పంటకు కనీసమద్దతు ధర కల్పిస్తామన్న చట్టబద్ధమైన హామీయేనని అన్నారు. తమ వేదికపై ఏ రాజకీయపార్టీకి చోటు లేదని.. అసలు రాజకీయపార్టీలని తామే బహిష్కరించామని రైతు సంఘాలు పేర్కొన్నాయి. తాము రాజకీయపోరాటం చేయడం లేదని స్పష్టం చేశారు రైతులు.

వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్న మోదీ.. వాస్తవాల ప్రాతిపదికన ఆ మేళ్లేంటో నిరూపించాలని.. రైతులు సవాల్ చేశారు. 6 రాష్ట్రాల రైతుల గురించి మాత్రమే మోదీ మాట్లాడుతున్నారని దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల గురించి మాత్రం మాట మాత్రమైనా మోదీ చెప్పడం లేదని మండిపడ్డారు. అసలు.. పంటలకు కనీసమద్దతు ధరకి చట్టబద్ధత కల్పించేందుకు మోదీ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This