వ్యవసాయాభిృద్ధిలో ఎవరి పథకాలు వారివేనా?

దేశమంతా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. వ్యవసాయాభివృద్ధికి, రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాల అమలులో లోపాలు అనేకం. వాటిని సరిదిద్దడానికి పెద్దగా ప్రయత్నాలూ జరగడం లేదు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే ఒకరకంగా, ఇతర పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో మరోరకంగా రైతు సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి పథకాలు అమలవుతున్నాయి. దేశంలో ఏ మూలకెళ్లినా రైతుల కష్టాలు దాదాపు ఒకే తీరుగా ఉన్నాయి. కానీ అధికారంలో ఉండే పార్టీలకు తగినట్లుగా నిర్ణయాలు ఉండటం అన్నదాతకు అశనిపాతంగా మారింది. జాతీయ ఆహార భద్రత లక్ష్యంగా అమలయ్యే వ్యవసాయాభివృద్ధి పథకాల అమలులో రాష్ట్రాలు తలోదారిన వెళ్తే… దేశ ప్రయోజనాలు ఎంత మేరకు నెరవేరతాయన్నది చర్చనీయాంశం.

వృథా అవుతున్న నిధులు

దేశంలో రైతు సంక్షేమం రాష్ట్రానికో తీరుగా సాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో పలు పథకాలు రైతులకు అందడం లేదు. వాటి రాయితీ నిధులు వృథాగా మిగిలిపోతున్నాయి. ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం కిసాన్‌)’ పథకం కింద ఆరో విడతలో నిధులను ఇటీవల విడుదల చేశారు. ఈ పథకానికి ఇప్పటికి మొత్తం రూ.92 వేల కోట్లకు పైగా ఇచ్చినట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. దేశంలో మొత్తం 10.45 కోట్ల రైతుల ఖాతాల్లోకి ఆరు విడతల్లో ఒక్కోసారి రెండు వేల రూపాయల చొప్పున కేంద్రం నేరుగా జమచేసింది. పశ్చిమ్‌ బంగలోని 71.23 లక్షల మంది రైతుల్లో ఒక్కరంటే ఒక్క రైతు ఖాతాకైనా ఒక్క విడతలోనూ నిధులు జమ కాలేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం పథకం అమలును నిలువరించినట్లు తెలుస్తోంది. పశ్చిమ్‌ బంగలోని మొత్తం రైతుల్లో 96 శాతం సన్న, చిన్నకారు రైతులేనని, వారి సగటు కమతం విస్తీర్ణం కేవలం ఎకరన్నర భూమేనని ఆ రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనే అధికారికంగా పేర్కొన్నారు. పైగా దేశంలో వరి, కూరగాయల పంటల దిగుబడిలో అగ్రస్థానంలో ఉంది. దేశానికి ఈ స్థాయిలో పంటలు అందిస్తూ ఆహారభద్రతకు తోడ్పడే నిరుపేద రైతులకు ఆర్థికసాయం, రాయితీలు అందకుండా పోయాయి.

జాతీయ ఆహార భద్రత మిషన్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం), రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన(ఆర్కేవీవైౖ), పీఎం కుసుమ్‌ తదితర కేంద్ర పథకాలను పలు రాష్ట్రాలు సరిగ్గా అమలు చేయకపోవడంతో రైతులకు రాయితీలు అందడం లేదు. పీఎంకుసుమ్‌ పథకం కింద పొలాల్లోని వ్యవసాయ బోర్లకు సౌరవిద్యుత్‌ ఏర్పాటు చేసేందుకు 2020-22 కాలానికి రూ.34,422 కోట్లను కేంద్రం కేటాయించింది. సాధారణ కరెంటు ఉత్పత్తికి చేస్తున్న వ్యయం, దాన్ని వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వడానికి రాయితీ రూపంలో దేశవ్యాప్తంగా భరిస్తున్న లక్ష కోట్ల రూపాయల సొమ్మును ఆదా చేసేందుకు పీఎంకుసుమ్‌లాంటి పథకాలు ఉపయోగపడతాయి. అత్యధికంగా 24 లక్షలకు పైగా వ్యవసాయ బోర్లకు ఉచిత కరెంటు ఇస్తూ ఈ ఏడాది రూ.10 వేల కోట్లను రాయితీగా భరిస్తున్న తెలంగాణ పీఎంకుసుమ్‌ పథకం అమలుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వరి, గోధుమలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి ఆహార పంటల దిగుబడులు పెంచి దేశానికి ఆహార భద్రత కల్పించడానికి ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం, ఆర్కేవీవై వంటి పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. వీటి కింద నిధులు రావాలంటే 60 శాతం కేంద్రమిస్తే మిగిలిన 40శాతం రాష్ట్రాలు భరించాలనే మెలిక పెట్టారు. కానీ 40 శాతం భరించలేక పలు రాష్ట్రాలు ఈ పథకాలను సరిగ్గా అమలు చేయడం లేదు. 2016-17లో ఏపీకి రూ.9.39 కోట్లు కేటాయిస్తే, రూ.8.76 కోట్లే తీసుకున్నారు. తెలంగాణకు రూ.5.70 కోట్లు కేటాయించగా, రూ.2.70 కోట్లు మాత్రమే తీసుకుని మిగిలిన రూ.3 కోట్లు వదిలేశారు. ఛత్తీస్‌గఢ్‌కు రూ.24.90 కోట్ల కేటాయిపుల్లో రూ.12.80 కోట్లే తీసుకున్నట్లు కేంద్రం వెలువరించిన శ్వేతపత్రం వివరించింది. ఇవన్నీ ఆహార పంటలు పండించే పేద రైతులకు రాయితీలుగా అందాల్సిన నిధులే. రైతుల ఆదాయం పెంచడానికి ప్రవేశపెడుతున్న అనేక పథకాల రాయితీలు అంతిమంగా రైతులకు సక్రమంగా చేరడం లేదనడానికి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. పంటల దిగుబడి పెరగాలంటే తొలకరిలో విత్తనాల దగ్గరి నుంచి పంట కోత అనంతరం అమ్మేదాకా అనేక మౌలిక సదుపాయాల కోసం రాయితీలుగా ఏటా లక్షల కోట్ల రూపాయల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్నాయి. అవి ఎంత వరకు రైతులకు చేరుతున్నాయి, వాటివల్ల నిజంగా దిగుబడులు పెరుగుతున్నాయా అన్నది పరిశీలించాల్సిన అంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This