అన్నదాతకు ఇదా వెన్నుదన్ను?

దుర్భర పరిస్థితుల్లో సైతం ఆహార కొరత క్రీనీడైనా పడకుండా దేశం నిబ్బరంగా ఉంటోందంటే కష్టకాలంలోనూ కాడీమేడీ వదలకుండా జాతికి వెన్నుదన్నుగా నిలుస్తున్న అన్నదాతలే కారణం. భిన్నరంగాలు కుదేలయ్యేలా కొవిడ్‌ రగిల్చిన కుంపట్లను చల్లార్చి ప్రగతి లక్ష్యాలు చేరేందుకంటూ ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం- అన్నదాతల్ని ఆదుకొనే విషయంలో ‘కొండనాలుక్కి మందేస్తే…’ చందమైన విధానాల్ని అనుసరించడమే దారుణం! దేశవ్యాప్తంగా రెండు హెక్టార్లలోపు కమతంగల సన్న చిన్నకారు రైతులు 86.2 శాతం; 12 కోట్ల 60 లక్షల మంది చిన్న రైతులకు ఒక్కొక్కరికీ సగటున 0.6 హెక్టార్ల సాగుభూమే ఉందన్నది రెండేళ్లనాటి పదో వ్యవసాయ గణన సారాంశం.

క్షేత్రస్థాయి వాస్తవాల్ని గుర్తించకుండా…

దశాబ్దాలుగా కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ)ల పేరిట రైతుల శ్రమదోపిడి విచ్చలవిడిగా సాగుతుంటే, పేరుగొప్ప వ్యవసాయ మార్కెట్లలో దళారుల దగా కర్షకుల ప్రయోజనాలకు కసిగా చితి పేరుస్తోంది. ఆ అవ్యవస్థకు చెల్లుకొట్టి పంటను రైతు ఎక్కడైనా అమ్ముకొని ఆకర్షణీయ ధర తెచ్చుకొనేలా వెలువరించిన ఆర్డినెన్స్‌ స్థానంలో కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంపై వ్యాపారులతో రైతులు చేసుకొనే ముందస్తు ఒప్పందాలకు రక్షణ కల్పించే మరో బిల్లూ ముందుకొచ్చింది. క్షేత్రస్థాయి వాస్తవాల్ని గుర్తించకుండా- మార్కెట్‌ శక్తుల మధ్య పోటీ పంటలకు సమధిక ధర రావడానికి, రైతు రాబడి ఇబ్బడిముబ్బడి కావడానికి దోహదపడుతుందన్న హ్రస్వదృష్టే ఆయా బిల్లుల్లో ప్రస్ఫుటమవుతోంది. జాతి ఆహార భద్రతకు నిష్ఠగా పూచీపడుతున్న రైతుల బాగోగులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం- మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు అన్నదాతను వదిలేయడమే విస్మయపరుస్తోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This