స్థానికేతరులకూ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

తిరుపతి కేంద్రంగా తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ కొనసాగుతోంది. తిరుపతి నగరంలోని ఐదు ప్రాంతాల్లో 50 కౌంటర్ల ద్వారా సర్వదర్శన టోకెన్ల జారీ చేపట్టిన తితిదే తొలిరోజు 75 వేల టికెట్లను భక్తులకు అందజేసింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భక్తులు తరలిరావడంతో అర్ధరాత్రి రెండు గంటలకు టికెట్ల జారీ ప్రారంభించిన తితిదే… గురువారం రాత్రి పది గంటల వరకు నిరంతరాయంగా జారీ చేసింది. డిసెంబర్‌ 25 నుంచి జనవరి 3 వరకు పది రోజుల పాటు రోజుకు 10వేల టికెట్ల చొప్పున లక్ష సర్వదర్శనం టికెట్లను జారీచేయాలని నిర్ణయం తీసుకొన్న తితిదే అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. టికెట్ల జారీ ప్రారంభించిన కొన్ని గంటల్లోపే ఏకాదశి, ద్వాదశి రోజుల టికెట్లు అయిపోయాయి. రాత్రి పది గంటల వరకు 50 కౌంటర్ల ద్వారా డిసెంబర్‌ 31 వరకు టికెట్లను జారీ చేశారు.

అర్ధరాత్రి రెండు గంటల నుంచి టికెట్ల జారీ కొనసాగించిన తితిదే రాత్రి పది గంటల తర్వాత తాత్కాలికంగా నిలిపివేసింది. తొలి రోజు డిసెంబర్‌ 25 నుంచి 31 తేదీ వరకు దర్శనం చేసుకొనేందుకు టికెట్లు జారీ చేసిన అధికారులు.. రెండో రోజు మిగిలిన మూడు రోజుల టికెట్లు భక్తులకు ఇవ్వనున్నారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు టోకెన్లను జారీ చేయనున్నారు. తొలి రోజు దాదాపు 75 వేల టికెట్లు జారీచేసినట్లు తితిదే అదనపు కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి తెలిపారు.

కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా ఎక్కువ మంది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు చేరకుండా చేసే లక్ష్యంతో స్థానికులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు జారీచేస్తామని ప్రకటించిన తితిదే.. అనంతరం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు టికెట్లు జారీచేసింది. మూడు, నాలుగు రోజల పాటు బస చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని దూర ప్రాంతాల నుంచి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకొన్నట్లు భక్తులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This