నూతన విద్యా విధానం- జాతి ప్రగతికి అక్కరకొచ్చేనా?

అధికార పీఠంపై కొలువు తీరి చక్రం తిప్పుతున్నది ఏ పార్టీ ప్రభుత్వమన్నదానితో నిమిత్తం లేకుండా- దేశానికి విదేశీ రక్షణ విధానాలున్నట్లే విద్యావిధానమూ ఉండాలన్న ప్రధాని మోదీ అభిభాషణ ఎవరూ వంక పెట్టలేనిది. జాతి నిర్మాణంలో పటిష్ఠ పునాదిగా భాసిల్లే పటుతర విద్యావిధానం కొరవడటంవల్ల దశాబ్దాల తరబడి ఇండియా ఎంతగానో కోల్పోయింది. పుస్తకాల మోత, విపరీతమైన పరీక్షల ఒత్తిళ్ల నుంచి ఉపశమనం ప్రసాదిస్తూ విద్యార్థుల్లో పఠనాసక్తిని సృజనాత్మక ఆలోచనల్ని రేకెత్తించేందుకంటూ- మోదీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది మొదలు, విస్తృత చర్చోపచర్చలకది కేంద్రబిందువైంది. దేశంలో అందరికన్నా ముందు దాన్ని గుజరాత్‌ అమలుపరుస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ చెబుతుండగా- విధాన కూర్పుపై తమిళనాడు, పశ్చిమ్‌ బంగ వంటివి భిన్నగళంతో స్పందిస్తున్నాయి.

ప్రజాసేవ…

బోధనను ప్రజాసేవగా అభివర్ణించిన కేంద్రం, దేశీయంగా విద్యావ్యాపారాన్ని నియంత్రించే చర్యల్ని ప్రస్తావించకపోవడం ఏమిటన్న అభ్యంతరాలూ వ్యక్తమవుతున్నాయి. సమష్టి కార్యాచరణ, సమధిక కేటాయింపులు, సాంకేతికతకు పట్టం కట్టడంలో సాధ్యాసాధ్యాలపై విమర్శలు, సూచనలు వినవస్తున్నాయి. ఎక్కడైనా భారీ మార్పులు తలపెట్టినప్పుడు ఎదురుగాలి ఎంత సహజమో, అనుమానాలూ అపోహల నివృత్తితో అందర్నీ కలుపుకొని ముందుకెళ్ళడమూ అంతే ఆవశ్యకం. నూతన విద్యావిధానం అమలులో ప్రభుత్వ జోక్యం కనిష్ఠస్థాయికి పరిమితమవుతుందని జాతిజనులకు ప్రధాని భరోసా ఇవ్వడం స్వాగతించదగింది. విద్యారంగం బలోపేతమైతేనే మానవ వనరుల శక్తియుక్తులు దేశానికి గరిష్ఠంగా ఉపయుక్తమవుతాయి. ఆ కలను సాకారం చేయగలిగితేనే ఈ యావత్తు కసరత్తు సార్థకమైనట్లు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This