‘ధోనీ’ జీవితం.. ఎందరికో ఆదర్శప్రాయం

తిరుగులేని కెప్టెన్‌.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మేటి బ్యాట్స్‌మన్‌.. అత్యుత్తమ ఫినిషర్‌.. గొప్ప వికెట్‌కీపర్‌.. ఆటలో ఏ కోణంలో చూసినా ధోనీకి ధోనీయే సాటి! క్రికెట్లో అతడి ఘనతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! అయితే ధోనీ అంటే అంతేనా? ఎంత మాత్రం కాదు! కేవలం క్రికెటర్‌ గానే కాదు.. వ్యక్తిగానూ ఓ ఆదర్శప్రాయుడు! తనకే సొంతమైన వ్యక్తిత్వంతో అతడు వేసిన ముద్ర ప్రత్యేకమైంది! ఓ విద్యార్థి కావచ్చు.. ఉద్యోగికావచ్చు.. వ్యాపారి కావచ్చు.. ఏ రంగానికి చెందిన వాళ్లయినా అనుసరించడానికి ధోనీ వేసిన పాదముద్రలు చాలానే ఉన్నాయ్‌!

మనసు మాట విను..

ఆటగాడిగా ఎదగాలనో.. సినిమాల్లో వెలిగిపోవాలనో.. స్టార్టప్‌ పెట్టి రుజువు చేసుకోవాలనో ఉంటుంది. అప్పుడే ఉద్యోగం తలుపు తడుతుంది. జీవితానికి ‘భద్రత’ ఉంటుంది, వదిలిపెట్టొద్దంటారు తల్లిదండ్రులు. వాళ్లు చెప్పింది నిజమే! కానీ అందులో చేరితే జేబు నిండినా.. మనసు నిండదు! అది నీ లక్ష్యం వైపు అడుగులెయ్‌ అంటుంది! ధోనీకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ధోనీ.. ఓ దశలో క్రికెట్‌ను పక్కన పెట్టి రైల్వే టీటీఈగా చేరాల్సి వచ్చింది. అందులో ఇమడలేకపోయాడు. ఇది కాదు తన జీవితం అనిపించింది! వదిలిపెట్టి క్రికెట్లోకే వచ్చేశాడు. తర్వాతి కథ ఓ చరిత్ర. ధోనీలా ప్రతి ఒక్కరికీ నచ్చిన రంగంలో అవకాశాలు రాకపోవచ్చు, విజయవంతం కాకపోవచ్చు. కానీ నీలో జ్వలించే కాంక్ష ఉన్నపుడు మనసు మాట విని సాగిపోవాలన్నది ధోనీ జీవితం చెప్పే పాఠం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This