దేశ రాజధానికి భారీ భూకంప ముప్పు!

దేశ రాజధాని ప్రాంతానికి భారీ భూకంప ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ హెచ్చరించింది. గత మే 29 నుంచి ఇప్పటివరకూ దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చోటుచేసుకున్న 14 భూప్రకంపనలు అసాధారణమేమీ కాదని, ఈ ప్రాంతంలో పీడనశక్తి పెరుగుతోందని చెప్పడానికి ఇవి సంకేతాలని పేర్కొంది.

“దిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతం అత్యధిక ప్రమాద తీవ్రత ఉన్న నాలుగో జోన్‌లో ఉంది. ఈ ప్రాంతాలు కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉంటాయి. స్వల్ప ప్రకంపనలు వస్తుంటాయి. ఇవేమీ పెద్ద భూకంపానికి సంకేతం కాదు. ఇటీవల దిల్లీ రాజధాని ప్రాంతంలో సంభవించిన వాటిల్లో మే 29న రోహ్‌తక్‌లో 4.6 తీవ్రతతో వచ్చిన ప్రకంపనమే పెద్దది. ఈ ప్రాంతంలో ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీసే భారీ భూకంప ముప్పును కొట్టిపారేయలేం. భూకంప అంచనా వ్యవస్థ లేదు కాబట్టి… ఇప్పటివరకూ ఉన్న ప్రకంపనలను భారీ భూకంప సంకేతంగా చెప్పలేం.”

– డాక్టర్‌ కలాచంద్‌ సైన్‌, వీఐహెచ్​జీ డైరెక్టర్​

ఈ ప్రాంతంలో ఎందుకొస్తున్నాయి?

భూగర్భ రాతి ఫలకల్లో ఉన్న పీడనశక్తి (స్ట్రెయిన్‌ ఎనర్జీ) విడుదల కావడం వల్లే దిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలో తరచూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరదిశన ఇండియన్‌ ప్లేట్‌ కదలడంతోపాటు, యూరాసియన్‌ ప్లేట్‌తో ఢీకొనడం వల్ల… బలహీనమైన జోన్లలోని రాతినెర్రెల ద్వారా పోగైన శక్తి విడుదలై ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. దిల్లీ రాజధాని ప్రాంతంలోని దిల్లీ-హరిద్వార్‌ కొండ ప్రాంతం, మహేంద్రగఢ్‌-దెహ్రాదూన్‌, మురాదాబాద్‌, సోహ్నా, గ్రేట్‌బౌండ్రీ, దిల్లీ-షార్గోఢా, యమున, గంగానదీ ప్రవాహ ప్రాంతం బలహీనమైన జోన్ల పరిధిలోకి వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This