తండ్రి మరణవార్తతో… కొడుకు హఠాన్మరణం

ఏపీలోని చిత్తూరు గ్రామీణ మండలం నల్లవెంకటయ్యగారిపల్లెకు చెందిన ఆంజనేయులనాయుడు (80) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్య సరోజమ్మ (70), ముగ్గురు కుమారులున్నారు. వారిలో ఇద్దరు స్వగ్రామంలోనే వ్యవసాయం చేస్తున్నారు. రెండో కుమారుడు నీరజాక్షులనాయుడు(56) బతుకుతెరువు కోసం తన కుటుంబం సహా 13 ఏళ్ల కిందట బెంగళూరు వెళ్లారు. ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. తండ్రి మరణ సమాచారం తెలిసి, కుటుంబీకులతో కారులో స్వగ్రామానికి బయలుదేరారు.

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో పలమనేరు అంతర్రాష్ట్ర సరిహద్దు దగ్గర పోలీసులు వారిని ఆపారు. రాష్ట్రంలోకి అనుమతించలేదు. తండ్రి మరణించినట్లు ఆధారాలు చూపాలని కోరారు. నీరజాక్షులనాయుడు గ్రామంలోని తన వారిని సంప్రదించారు. వారు ఆయన చరవాణి వాట్సప్‌నకు తండ్రి మృతదేహం ఫొటోలు పంపించారు.

అవి చూసిన నీరజాక్షులనాయుడు తట్టుకోలేకపోయారు. తీవ్ర ఆవేదనకు గురై అక్కడే కుప్పకూలారు. పోలీసులు వైద్యులను పిలిపించగా.. ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించి, స్వగ్రామానికి పంపారు. ఒకేరోజు తండ్రీ కుమారులు మరణించడంపై గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నీరజాక్షులనాయుడుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This