అందరికీ దూరంగా.. మీ జ్ఞాపకాల్లో పదిలంగా…

నాన్న.. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దేశభక్తి పాఠాలు బోధిస్తూ నా మదినిండా మాతృదేశంపై ప్రేమను నింపారు. అందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే..? దేశంకోసం పనిచేసే గొప్ప అవకాశం అందరికీ రాదుకదా. అందుకే అమ్మతో అంటుండేవాడిని ‘పుట్టేటపుడు ఈ భూమి మీదకు ఏమీ పట్టుకుని రాము. తిరిగి వెళ్లేటపుడూ ఏమీ తీసుకెళ్లం. ఈ మధ్యన సాగించిన జీవన ప్రయాణానికి ఓ సార్థకత ఉండాలి’ అని. అది నాకు దక్కేలా పెంచినందుకు మీకు ధన్యవాదాలు.

అమ్మ.. చనుబాలతోనే నాకు దేశభక్తిని తాగించిందేమో అందుకే, నా నరనరాన దేశభక్తి తొణికిసలాడేది. మీ అందరికీ వేల కి.మీ. దూరంలో.. దేశ సరిహద్దుల్లో నేను విధులు నిర్వహించే సమయంలో అమ్మను గుర్తుచేసుకున్నా.. దేశాన్ని గుర్తుచేసుకున్నా నాకు ఒకేలా అనిపించేంది. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కడుపునే పుడతాను. సైనికుడిగానే భరతమాతకు సేవ చేస్తాను. చిన్నప్పుడు చదువు పేరుతో.. ఆ తర్వాత ఉద్యోగం పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ మీతో గడిపింది చాలా తక్కువ సమయం. ఇది నాలో కొంత అసంతృప్తిని మిగిల్చింది.

మరో రెండు నెలల్లో హైదరాబాద్‌కు బదిలీపై వస్తే మీతో, చెల్లి కుటుంబంతో, భార్యాపిల్లలతో, బంధువులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపొచ్చు అనుకున్నా. ఇంతలోనే శత్రువు దొంగదెబ్బ రూపంలో మనల్ని దూరం చేశాడు. నేను మీకు దగ్గరగా పదేళ్ల వయసు వరకు పెరిగాను. నా కొడుకు అంతకన్నా చిన్నవయసులో ఉన్నాడు. వాడిలో నన్ను చూసుకోండి. నా కూతురిని జాగ్రత్తగా చూసుకోండి.

నా సతీమణికి మిగిలిన విషాదం పూడ్చలేనిది. చిన్నప్పుడు నాకు తోడుగా ఉన్నట్లు, ఇప్పుడు ఆమెకు మీ తోడు, నీడ అవసరం. అన్నింటికి మించి మీరు ఈ వయసులో గుండె నిబ్బరాన్ని చూపుతున్నందుకు గర్వంగా ఉంది. మీ కడుపున నేను, చెల్లి ఇద్దరమే పేగు తెంచుకుని పుట్టొచ్చు. ఇప్పుడు చూశారా? యావత్‌ జాతి మన కుటుంబంలా మీ వెనుక నిల్చుంది. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎక్కడ, ఎలాంటి విధులు నిర్వర్తిస్తున్నదీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదీ దేశభద్రత కారణాల రీత్యా మీకు చెప్పేవాడినికాదు. ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది. మీ అందరికీ దూరంగా, మీ జ్ఞాపకాల్లో పదిలంగా ఉండే చివరి మజిలీకి వెళుతున్నా.

ఇక సెలవు… మీ

బిక్కుమళ్ల సంతోష్‌బాబు, కర్నల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This