ఎస్సీ యువకుడి లాకప్​డెత్​… మధ్యవర్తితో రాజీయత్నం…!

ఏపీలోని విజయవాడలో ఎస్సీ యువకుడి లాకప్‌డెత్‌ కేసు మరో మలుపు తిరిగింది. బాధిత కుటుంబంతో రాజీ కుదుర్చుకునేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. అక్రమంగా మద్యం రవాణా చేసిన కేసులో 11వ నిందితుడిగా ఉన్న డోవారి అజయ్‌ను ఎస్​ఈబీ పోలీసులు గురువారం విచారణ నిమిత్తం తీసుకెళ్లగా ఠాణాలో మృతిచెందాడు. పిట్స్ లక్షణాలు వచ్చి పడిపోతే ఆస్పత్రికి తీసుకెళ్లామని ఈలోపే అజయ్​ గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక అజయ్‌ చనిపోయాడని ఎస్సీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మధ్యవర్తి ద్వారా రాజీ..!

విజయవాడ జీజీహెచ్​లో నిర్వహించిన శవపరీక్షలో వైద్యులు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు. ఫోరెన్సిక్‌ పరీక్ష ఫలితాలు వచ్చాకే కారణం తెలుస్తుందని అంటున్నారు. అజయ్‌ 87 కిలోలతో వయసుకు మించి అధిక బరువున్నట్లు తెలిపారు. యువకుడి మరణంపై కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనా….నిందితుల పేర్లను మాత్రం చేర్చలేదు. ఈ అంశం వివాదం కాకుండా ఉండేందుకు….అధికారులు మధ్యవర్తి ద్వారా కుటుంబసభ్యులతో రాజీ నడుపుతున్నట్లు చెబుతున్నారు. పరిహారంగా రూ.15 లక్షలు, 100 గజాల నివేశన స్థలం, కుటుంబంలో ఒకరికి ఒప్పంద ఉద్యోగం ఇచ్చేందుకు హామీ లభించినట్లు సమాచారం. గురువారమే ఈ ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎస్సీ సంఘాలు ఆందోళనను విరమించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This