రూట్​ జోరును కోహ్లీసేన ఆపగలదా?

శ్రీలంకపై విజయంతో ఫుల్​జోష్​ మీద ఉంది ఇంగ్లాండ్​. అయితే ఈ సిరీస్​ కైవసం చేసుకోవడంలో ఇంగ్లీష్​ జట్టు సారథి జో రూట్​ బాదిన శతకాలే కీలకం. ఇదే జోరుతో టీమ్ఇండియాను ఢీ కొట్టడానికి భారత పర్యటనకు రానున్నాడు. మరి కోహ్లీ సేన ఇతడిని ఆపగలదా? ఉపఖండాల్లో రూట్​ గణాంకాలు సహ పలు విషయాల సమాహారమే ఈ కథనం.

బిగ్‌-4.. పోరుపై ఉత్కంఠ

సమకాలీన క్రికెట్‌ ప్రపంచంలో ‘బిగ్‌ 4’ అంటే విరాట్‌ కోహ్లీ, విలియమ్సన్‌, స్టీవ్‌స్మిత్‌, జోరూట్‌. దాదాపుగా వీరి వయసు, ఆటతీరు, జట్టులో ప్రాముఖ్యం ఒకేలా ఉంటుంది. మూడు ఫార్మాట్లు ఆడుతున్నా టెస్టు క్రికెట్‌కే మరింత ప్రాధాన్యం ఇస్తారు. నాయకులుగా తమ జట్లపై తమదైన ముద్రవేశారు. ఈ నలుగురిలో ఏ ఇద్దరు మైదానంలో తలపడ్డా ఆసక్తికరంగా ఉంటుంది. అభిమానులు, విశ్లేషకుల్లో ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో అన్న ఉత్కంఠ కలుగుతుంది. ఫిబ్రవరి 5 నుంచి ఉపఖండంలో కోహ్లీ, జో రూట్​ ఎదురుపడనున్నారు. తండ్రైన ఆనందంలో విరాట్‌ ఉంటే లంకేయులపై విధ్వంసకర శతకాలు చేసి 2-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన సంతోషంలో రూట్‌ ఉన్నాడు. అతడిని ఆపడం టీమ్‌ఇండియాకు అత్యంత అవసరం. లేదంటే నిలకడ, పట్టుదలకు మారుపేరైన అతడు భారత్‌లోనూ పరుగుల వరద పారించడం ఖాయం.

ద్విశతకం.. శతకం

అదేంటో శ్రీలంక అంటే చాలు జోరూట్‌ విరుచుకుపడుతున్నాడు. అతడి నేతృత్వంలో గత పర్యటనలో 3-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన ఇంగ్లాండ్‌ ఈ సారీ 2-0తో సిరీసును ఊడ్చేయడం గమనార్హం. ముఖ్యంగా ప్రస్తుత విజయాల్లో కీలక పాత్ర పోషించింది కెప్టెన్‌ జో రూట్‌ అనడంలో సందేహమే లేదు. 4 ఇన్నింగ్సుల్లో 106.50 సగటు, 65.63 స్ట్రైక్‌రేట్‌తో 649 బంతులు ఎదుర్కొని 426 పరుగులు చేశాడు. ఇందులో రెండు భారీ శతకాలు ఉండటం ప్రత్యేకం. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతడు 321 బంతులు ఎదుర్కొని 71.03 స్ట్రైక్‌రేట్‌తో 228 పరుగులు చేశాడు. ద్విశతకంతో ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టాడు. ఇందుకోసం దాదాపుగా ఎనిమిది గంటలు క్రీజులో నిలిచాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ రూట్‌ 309 బంతులాడి 186 పరుగులు చేశాడు. రూట్‌ను ఔట్‌ చేసేందుకు లంకేయులు ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. అలసిపోవడం వల్ల రూట్‌ వికెట్‌ ఇచ్చాడే గానీ అంత సులువగా ఔటవ్వలేదు.

స్వీప్‌ షాట్‌తో 25% పరుగులు

స్పిన్‌ ప్రభావం చూపించే శ్రీలంకలో జో రూట్‌ 426 పరుగులు చేశాడంటే కారణం స్వీప్ ‌షాట్‌. సాధారణంగా టర్న్‌ అయ్యే బంతుల్ని ఎదుర్కొనేందుకు బ్యాట్స్‌మెన్‌ వాడే ప్రధాన అస్త్రం స్వీప్‌. అయితే అందరూ దీన్నంత సమర్థంగా ఆడలేరు. రూట్‌ హిట్టవ్వడానికి మిగతా ఆటగాళ్లు విఫలమవ్వడానికి కారణమిదే. అతనాడినంత సమయోచితంగా, కచ్చితత్వంతో ఇంగ్లాండ్‌లోని ఇతర ఆటగాళ్లు ఆడలేకపోయారు. లంక సిరీసులో రూట్‌ 37 బౌండరీలు, 1 సిక్సర్‌ బాదాడు. అందులో 16 బౌండరీలు స్వీప్‌ షాట్‌ ద్వారానే లభించాయి. మొత్తంగా 105 పరుగులు స్వీప్‌ ద్వారా రాబట్టాడు. దాదాపు 25% పరుగులు ఇలానే వచ్చాయి. టీమ్ఇండియాతో ఇంగ్లాండ్‌ తలపడే తొలి రెండు టెస్టులకు వేదిక చెపాక్‌. దాదాపుగా ఇక్కడి వాతావరణ పరిస్థితులు గాలెకు మరీ భిన్నంగా ఏమీ ఉండవు. పిచ్‌ సైతం మందకొడిగా ఉంటుంది. స్పిన్నర్లే ప్రభావం చూపుతారు. ఇక్కడా రూట్‌ ప్రధాన అస్త్రం స్వీప్‌షాటే కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This