కొవిడ్‌పై దుర్బల పోరు.. పోషకాహార లోపమే శాపం

రెక్కాడితేగాని డొక్కాడని స్థితిలో ఆకలి, దారిద్య్రంతో అలమటిస్తున్న నిరుపేదలను కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా పేదలను అగాధంలోకి తోసేసిందని ప్రపంచ పౌష్టికాహార నివేదిక-2020 స్పష్టం చేస్తోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కరవై పేదరికంలో మగ్గుతున్న కోట్లమందికి పౌష్టిక ఆహారం మాటేమోగాని, వారికి కనీసం తినడానికి తిండి కూడా అందడం లేదు. వారిలో సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ కారణంగానే కొవిడ్‌ మహమ్మారికి బలైన వారిలో నిరుపేదలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ పౌష్టికాహార నివేదిక-2020 సైతం స్పష్టం చేసింది.

లోపాలను సవరించేదెప్పుడు?

కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి పౌష్టికాహారమే శరణ్యమని వైద్య నిపుణులు, ఆహార నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రభుత్వాధినేతలు చెబుతున్నారు. పోషకాహారం తక్కువ ధరకు అందుబాటులో ఉండి సులభంగా లభ్యమయ్యే సమాజాల్లో- కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజలు సర్వసన్నద్ధమై ఉంటారు. కొవిడ్‌ మహమ్మారి వల్ల అకస్మాత్తుగా ప్రకటించిన లాక్‌డౌన్‌వల్ల కోట్లమంది నిరుపేదలు, అసంఘటిత కార్మికులు పనులు కోల్పోయారు. ఒక్కసారిగా జీవనోపాధిని కోల్పోవడంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థ తక్షణ సహకారం అందించడంలో విఫలమైంది. ఈ తరహా పరిస్థితుల మధ్య పేదలు పౌష్టికాహారం ఎలా సమకూర్చుకొని కరోనాను కాచుకుంటారనేది ప్రశ్నార్థకమే. ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత పరిధిలో ఉన్న లక్షల మంది పౌష్టికాహార కొరతను ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఆరోగ్య రక్షణ, ఉపాధికల్పన, ఉద్యోగ భద్రతల్లో నెలకొన్న డొల్లతనం బహిర్గతమైంది. కరోనాను ఎదుర్కోవడానికి యుద్ధప్రాతిపదికన బలహీన వర్గాలకు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో నాణ్యమైన, బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించి సామాన్యుల ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈక్రమంలో అన్ని వర్గాల ప్రజల ఆరోగ్య వ్యయాల్ని తగ్గించడానికి ప్రభుత్వాలు వారిని ఒక విశ్వజనీనమైన ఆరోగ్య భద్రత వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This